Fri Dec 05 2025 09:33:41 GMT+0000 (Coordinated Universal Time)
Supreme Court : తదుపరి సీజేఐగా సూర్యకాంత్
భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ తన వారసుడిగా జస్టిస్ సూర్యకాంత్ పేరును కేంద్రానికి సిఫార్సు చేశారు

భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ తన వారసుడిగా జస్టిస్ సూర్యకాంత్ పేరును కేంద్రానికి సిఫార్సు చేశారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో రెండవ సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న సూర్యకాంత్, నవంబర్ 24న 53వ సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. గవాయ్ నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్నారు.మే 14వ తేదీన పదవీ బాధ్యతలు చేపట్టిన గవాయ్ ఈ సిఫారసును కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు పంపినట్లు సమాచారం. సూర్యకాంత్ 2019 మే 24న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయనకు సీజేఐగా దాదాపు ఒకటిన్నర సంవత్సరం పదవీకాలం లభించనుంది. ఆయన పదవీ విరమణ తేదీ 2027 ఫిబ్రవరి 9వ తేదీ.
హర్యానాలో జన్మించిన...
సుప్రీం కోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు అరవై ఐదేళ్లు. న్యాయమూర్తుల నియామకం, బదిలీ, పదోన్నతి విధానాలను పేర్కొనే ‘మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్’ ప్రకారం, సుప్రీం కోర్టులో సీనియర్ జడ్జీని సీజేఐగా నియమించడం సాంప్రదాయం. ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణకు నెలరోజుల ముందే కేంద్ర న్యాయ మంత్రి కొత్త సీజేఐ కోసం సిఫారసు కోరడం సంప్రదాయంగా వస్తుంది. 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిసార్ జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సూర్యకాంత్, రెండు దశాబ్దాలుగా న్యాయవ్యవస్థలో సేవలందిస్తున్నారు. ఆయన ఆర్టికల్ 370 రద్దు, స్వేచ్ఛా హక్కులు, అవినీతి, పర్యావరణం, లింగ సమానత్వం వంటి అంశాలపై పలు కీలక తీర్పులు వెలువరించారు.
Next Story

