Mon Dec 08 2025 06:09:29 GMT+0000 (Coordinated Universal Time)
IndiGo : దిగి వచ్చిన ఇండిగో.. ప్రయాణికులకు 610 కోట్ల చెల్లింపు
ఇండిగో ప్రయాణికుల ఖాతాల్లోకి రద్దయిన విమానాలకు సంబంధించి ప్రయాణికులకు టికెట్ డబ్బులను చెల్లించింది

ఇండిగో ప్రయాణికుల ఖాతాల్లోకి రద్దయిన విమానాలకు సంబంధించి ప్రయాణికులకు టికెట్ డబ్బులను చెల్లించింది. 610 కోట్ల రీఫండ్ ఇండిగో సంస్థ చెల్లించింది. ఆరు రోజుల సంక్షోభం తర్వాత ప్రయాణికులకు చెల్లింపులు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా చెప్పడంతో ఇండిగో సంస్థ రద్దయిన విమాన సర్వీసులకు సంబంధించిన ఛార్జీలను తిరిగి ప్రయాణికులకు చెల్లించింది. అయితే ప్రస్తుతం డీజీసీఏ నిబంధనలను సడలించడంతో 75 శాతానికి ఇండిగో ఆన్‌టైమ్ పనితీరు మెరుగుపడింది. ఈ నెల 10 నాటికి పరిస్థితి మెరుగవుతుందని అంచనా ఉంది. ఈ నెల15వ తేదీ వరకు రీషెడ్యూల్ చార్జీలు రద్దు చేస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. ఈ నెల 15 వరకు విమాన ఛార్జీలపై కేంద్రం పరిమితులు విధించడం, ఇండిగో సంక్షోభంపై విమానయానశాఖ దర్యాప్తునకు ఆదేశించడంతోనే ఈ చర్యలను ఇండిగో సంస్థ ప్రారంభించింది.
అతిపెద్ద సంస్థగా...
ఇండియాలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్. కొత్త సిబ్బంది విధుల నియమాలు, సాంకేతిక లోపాల కారణంగా ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత కొన్ని రోజులుగా వెయ్యికి పైగా విమానాలు ఆలస్యం అలస్యం కావడం లేదా రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరిగి సాధారణ పరిస్థితి నెలకొంటుందని ఆశించినప్పటికీ వరసగా అన్ని రోజులు విమానాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. అయితే ఇండిగో యాజమాన్యం మాత్రం పది రోజుల్లో పరిస్థితులు సర్దుకుంటాయని, యధాతధంగా తమ సేవలను అందిస్తామని ప్రయాణికులకు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అదే సమయంలో సాంకేతిక కారణాల వల్లనే ఈ అసౌకర్యమని చెప్పింది.
విమానయానంలో ఆధిపత్యం...
ఇండిగో ఎయిర్‌లైన్స్ మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెట్ ను రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ కలిసి స్థాపించారు. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ 1989లో ఏర్పాటు అయ్యింది. ఎయిర్ లైన్స్ నిర్వహణలో ప్రత్యేకత కలిగిన ఈ సంస్థ మార్కెట్ వాటా పరంగా భారతదేశంలో అతిపెద్ద క్యారియర్ గా ఎదిగింది. రాహుల్ భాటియా ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్‌కు గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన సంస్థలోని కీలక వాటాదారులలో ఒకరు. కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన భాటియా నాయకత్వంలో 'ఇండిగో సంస్థ నడుస్తుంది. ఇంకొక సహ వ్యవస్థాపకుడు అయిన రాకేష్ గంగ్వాల్, ఇండిగోను స్థాపించడంలో కీలక పాత్ర పోషించినప్పటికీ, 2022లో కంపెనీ డైరెక్టర్ల బోర్డు నుంచి వైదొలిగారు. అప్పటి నుండి ఆయన ఎయిర్ లైన్ లో తన వాటాను విక్రయిస్తున్నారు.ఇండిగో ప్రస్తుతం 434 సొంత విమానాలను కలిగివుంది. అలాగే రోజుకు 2,300 విమానాలను నడుపుతూ, దేశీయ విమానయాన రంగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
Next Story

