Sat Jan 17 2026 03:42:12 GMT+0000 (Coordinated Universal Time)
Iran : ఇరాన్ నుంచి భారతీయుల రాక.. అక్కడి పరిస్థితులపై ఏమంటున్నారంటే?
ఇరాన్ లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు.

ఇరాన్ లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. ఇరాన్లో భద్రతా పరిస్థితులు తీవ్రంగా మారడంతో అక్కడ ఉన్న భారతీయులు శుక్రవారం రాత్రి న్యూఢిల్లీకి చేరుకున్నారు. పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయని పేర్కొంటూ ఇరాన్లో ఉన్న భారతీయులు దేశం విడిచి రావాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సూచించింది. పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని, భారతీయుల భద్రతే తమ ప్రాధాన్యమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వం వాటిని అణిచివేసే కార్యక్రమంలో భాగంగా నిరసన కారులను అరెస్ట్ చేస్తుంది.
దేశం విడిచి వచ్చేయాలని...
భారత ప్రభుత్వం ఇరాన్ లో నివసిస్తున్న భారతీయులను ఆ దేశం విడిచి రావాలని కోరింది.అక్కడ పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయని, భారత ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని వీలైనంత త్వరగా ఇరాన్ విడిచిపెట్టాలనే సమాచారాన్ని దౌత్య కార్యాలయం ముందుగానే ఇచ్చిందని ఇక్కడకు వచ్చిన భారతీయులు తెలిపారు. తాము నెల రోజులుగా ఇరాన్లో ఉన్నామని, అయితే గత రెండు వారాలుగా సమస్యలు పెరిగాయని తెలిపారు. బయటకు వెళ్తే ఆందోళనకారులు కార్ల ముందు నిలబడి ఇబ్బంది పెట్టేవారు. ఇంటర్నెట్ నిలిపివేయడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేకపోయామని చెప్పారు. తీవ్ర ఆందోళనలో ఉన్నామని, దౌత్య కార్యాలయాన్ని కూడా సంప్రదించలేకపోయామని కొందరు చెప్పారు.విమానాశ్రయంలో కుటుంబ సభ్యుల ఎదురుచూపులు చూస్తూ వారి కోసం వేచి ఉండటం కనిపించింది.
ప్రమాదకరంగా మారడంతో...
అక్కడి నిరసనలు చాలా ప్రమాదకరంగా మారాయి. విద్యార్థులను సురక్షితంగా తీసుకురావడంలో భారత ప్రభుత్వం మంచి ప్రయత్నం చేసిందని మరికొందరు అన్నారు.ఇదిలా ఉండగా, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తమవాళ్ల కోసం కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఎదురుచూశారు. ఇరాన్ ఎప్పుడూ భారత్‌కు స్నేహపూర్వక దేశమేనని, అయితే అక్కడ ఆందోళనలు తమను భయపెట్టాయని చెబుతున్నారు. ఇంటర్నెట్ లేకపోవడంతో రోజుల తరబడి సమాచారం రాలేదని, యుద్ధ పరిస్థితుల్లా ఉండటంతో తీవ్ర భయం వేసిందని, ఇప్పుడు సురక్షితంగా స్వదేశానికి చేరుకోవడం ఊరట కలిగిస్తోందని చాలా మంది స్వదేశానికి వచ్చిన వారు చెబుతుండటం విశేషం. టెహ్రాన్‌లోని భారత దౌత్య కార్యాలయం విద్యార్థులు, వ్యాపారులు, యాత్రికులు, పర్యాటకులు సహా భారతీయులు అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాల ద్వారా ఇరాన్ విడిచి రావాలని సూచించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇరాన్‌కు ప్రయాణాలు మానుకోవాలని కూడా ఎంఈఏ సూచించింది.
Next Story

