Sun Jan 25 2026 03:47:01 GMT+0000 (Coordinated Universal Time)
గణతంత్ర వేడుకలకు భారత్ సిద్ధం.. దేశ వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తి
77వ గణతంత్ర దినోత్సవానికి ముందుగా దేశవ్యాప్తంగా పలు నగరాలు దేశభక్తి కాంతులతో వెలిగాయి

గణతంత్ర దినోత్సవానికి ముందుగా దేశవ్యాప్తంగా పలు నగరాలు దేశభక్తి కాంతులతో వెలిగాయి. జమ్మూకశ్మీర్ నుంచి ముంబై తీరాల వరకూ కుంకుమ, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో ప్రముఖ కట్టడాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జమ్మూకశ్మీర్ నుంచి ముంబై వరకూ త్రివర్ణ వెలుగులతో నిండిపోయాయి.జమ్మూకశ్మీర్ రియాసీ జిల్లాలోని సలాల్ డ్యామ్‌ను శనివారం సాయంత్రం త్రివర్ణ దీపాలతో అలంకరించారు. భారీ డ్యామ్ మొత్తం కుంకుమ, తెలుపు, ఆకుపచ్చ కాంతుల్లో మెరిసింది. ముంబైలో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌తో పాటు పలు భవనాలు త్రివర్ణ కాంతులతో వెలిగాయి.
అన్ని ప్రధాన కార్యాలయాలు...
వెస్ట్రన్ రైల్వే ప్రధాన కార్యాలయాన్ని కూడా జాతీయ జెండా రంగుల్లో వెలిగించారు. మంత్రాలయ భవనం ప్రత్యేకంగా ఆకట్టుకుంది.లక్నోలో రిహార్సల్, రహదారుల అలంకరణ చేశారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ప్రభుత్వ భవనాలు, ప్రధాన రహదారులు త్రివర్ణ వెలుగులతో అలంకరించారు. 77వ గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లలో భాగంగా అసెంబ్లీ భవనం ముందు పూర్తి స్థాయి రిహార్సల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భద్రతా దళాల బృందాలు, పాఠశాల విద్యార్థులు, కళాకారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.
రేపు ఢిల్లీలో జరిగే...
ఇదిలా ఉండగా, జనవరి 26న ఢిల్లీలోని కర్తవ్య పథ్‌పై జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో భారత సైన్యం ప్రత్యేక ‘బ్యాటిల్ అరే’ ప్రదర్శన ఇవ్వనుంది. ఆధునిక సాంకేతికతతో సమన్వయంగా పనిచేసే యుద్ధ సిద్ధతను ఈ ప్రదర్శన చూపించనుంది. పరేడ్ పరిధిలో తొలిసారిగా యుద్ధోన్ముఖ క్రమంలో సైనిక, యాంత్రిక దళాల శ్రేణులు కదలనున్నాయి. పలు కొత్త వేదికలు, యూనిట్లు ఈసారి పరేడ్‌లో అరంగేట్రం చేయనున్నాయి. స్వదేశీ సామర్థ్యం, కార్యాచరణలో నైపుణ్యంతో భారత సైన్యం ఆధునికీకరణ దిశను ఈ పరేడ్ ప్రతిబింబించనుంది. రిపబ్లిక్ డే ముందురోజు త్రివర్ణ కాంతులతో దేశంలోని ప్రధాన కట్టడాలు దేదీప్యమానంతో మెరిశాయి
Next Story

