Wed Jul 09 2025 19:29:54 GMT+0000 (Coordinated Universal Time)
ప్రతీకారం తీర్చుకున్న భారత్.. ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడులు
పహాల్గాం దాడిపై ప్రతీకారంగా భారత్ ప్రతీకార చర్యలకు దిగింది. మంగళవారం అర్ధరాత్రి ఆపరేషన్ సింథూర్ ను ప్రారంభించింది.

పహాల్గాం దాడిపై ప్రతీకారంగా భారత్ ప్రతీకార చర్యలకు దిగింది. మంగళవారం అర్ధరాత్రి ఆపరేషన్ సింథూర్ ను ప్రారంభించింది. అర్ధరాత్రి 1.44 గంటలకు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులకు దిగింది. బారత్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సమిష్టిగా ఈ దాడులు నిర్వహించాయి. మిసైళ్లతో పాక్ లోని ఉగ్రస్థావరాలపై దాడులకు దిగాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటుగా పాకిస్థాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహించాయి. మొత్తం తొమ్మిది స్థావరాలపై భారత్ ఆర్మీ ఈ దాడులకు దిగింది. ఖచ్చితమైన సమాచారంతో లక్ష్యంతో దాడులకు దిగింది.
పాక్ పై యుద్ధం కాదని...
అయితే ఇది పాకిస్థాన్ పై యుద్ధం కాదని, కేవలం అక్కడ ఉగ్రవాద స్థావరాలపైనేనేని భారత్ చెబుతుంది. ఆపరేషన్ సింధూర్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. పహాల్గాం దాడిలో ఇరవై ఆరు మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను వదిలిపెట్టేది లేదని గత కొన్ని రోజులుగా ప్రధాన మంత్రి మోదీ నుంచి రక్షణ మంత్రి, హోం మంత్రి చెబుతూ వస్తున్నారు. దానికి అనుగుణంగా ప్రధాని త్రివిధ దళాలకు చెందిన అధిపతులతో నిత్యం సమావేశమవుతూ చర్చించినప్పటికీ పాక్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై నేరుగా భారత్ దాడికి దిగుతుందని ఎవరూ ఊహించలేదు. యుద్ధ సన్నాహక చర్యల్లో భాగమేనని అనుకున్నారు.
పాక్ స్పందన ఇదే...
కానీ తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించి భారత్ పౌరుల ప్రాణాలను తీసిన ఉగ్రవాదులను వదిలిపెట్టేది లేదన్న ప్రధాని మాటలు కార్యరూపం దాల్చినట్లయింది. భారత్ చేసిన మెరుపు దాడులను పాక్ సైన్యం కూడా ధృవీకరించింది. పాక్ లోని కొట్లీ, మురిడ్కే, బహల్బూర్, ముజఫర్ బాద్ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లు పాక్ డీజీ ఐ.ఎస్.పీ.ఆర్. లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ చౌదురి తెలిపారు. ఈ దాడుల్లో ముగ్గురు చనిపోయారని, పన్నెండు మందికి గాయాలయ్యాయని పాక్ ఆర్మీ తెలిపింది. పాక్ కూడా గత కొన్ని రోజులుగా తమ పౌరులను యుద్ధానికి సన్నద్ధులను చేస్తుంది. రెండు నెలలకు సరిపడా ఆహార ధన్యాలను నిల్వ ఉంచుకోవాలని కూడా ఆదేశించిన నేపథ్యంలో అర్ధరాత్రి ఆపరేషన్ సింథూర్ ప్రారంభమయింది.
Next Story