తిరువణ్ణామలై జిల్లాలో మట్టికుండలో బంగారు నాణేలు
తిరువణ్ణామలై జిల్లాలో ఓ పురాతన శివాలయంలో 103 బంగారు నాణేలు బయటపడ్డాయి.

తిరువణ్ణామలై జిల్లాలో ఓ పురాతన శివాలయంలో 103 బంగారు నాణేలు బయటపడ్డాయి. జవ్వాదు కొండల సమీపంలోని కోవిలూర్ గ్రామంలో ఉన్న చారిత్రాత్మక శివాలయంలోని గర్భగుడికి పునరుద్ధరణ పనులు చేపడుతుండగా, కార్మికులు తవ్వకాలు జరిపారు. ఈ క్రమంలో వారికి ఓ పాత మట్టి కుండ లభించింది. దాన్ని జాగ్రత్తగా తెరిచి చూడగా, అందులో పురాతన కాలం నాటి బంగారు నాణేలు ఉన్నాయి. సమాచారం అందుకున్న రెవెన్యూ, హిందూ మత ధర్మాదాయ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆలయం చోళ రాజు మూడో రాజరాజ చోళుని కాలంలో నిర్మించినట్లుగా భావిస్తున్నారు. ఆలయ నిర్మాణ శైలి కూడా ఆ కాలానికి చెందిన లక్షణాలను కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు. నాణేలు చివరి చోళుల కాలానికి లేదా తొలి పాండ్యుల కాలానికి చెందినవి కావొచ్చని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ నాణేలను పురావస్తు శాఖ నిపుణులు పరిశీలిస్తున్నారు.

