Mon Apr 21 2025 21:18:09 GMT+0000 (Coordinated Universal Time)
Kejrival : కేజ్రీవాల్ చేసిన తప్పేంటి? అవినీతి కేసుల్లో నిజమెంత?
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓటమి ఆశ్చర్యానికి గురిచేసింది.

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓటమి ఆశ్చర్యానికి గురిచేసింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడి అధికారంలోకి వచ్చిన ఆయన అదే విషయానికి చివరకు బలయిపోయారు. ఆయనపై అవినీతి ముద్ర బలంగా పడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ, కోట్లు చేతులు మారాయంటూ వచ్చిన విమర్శలు మాత్రం జనంలోకి బాగా చొచ్చుకు వెళ్లాయి. రాజకీయ నాయకుడు అవినీతి చేస్తే సహిస్తారు. లక్షల కోట్లు సంపాదించారని అన్నా పెద్దగా కేర్ చేయరు. కానీ అవినీతికి వ్యతిరేకంగా పోరు అంటూ ప్రజల్లోకి వచ్చిన కేజ్రీవాల్ ను జనం అలానే చూశారు. అలా చూసిన కేజ్రీవాల్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మార్పు వచ్చింది.
అత్యాశకు పోయి...
అప్పటి వరకూ పాలనపైనే ఫోకస్ పెట్టిన కేజ్రీవాల్ తర్వాత క్రమంగా రాజకీయాలను మొదలు పెట్టారు. కాంగ్రెస్ ప్లేస్ ను తాను ఆక్రమించుకుందామని అతి ఆశకు పోయారు. పంజాబ్ లో పోటీ చేసి విజయం సాధించిన తర్వాత హర్యానాలోనూ తాను అధికారంలోకి రావాలని భావించారు. సొంత రాష్ట్రంలో పార్టీని విజయ పథాన నడపించాలన్న అత్యాశతో కాంగ్రెస్ తో జట్టు కలవకుండా విడిగా పోటీ చేశారు. కాంగ్రెస్ తో పాటు తాను ఓటమి పాలయ్యారు. అంతకు ముందు గుజరాత్ లోనూ అంతే. ఇక వారణాసిలోనూ నరేంద్ర మోదీ పైన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఢిల్లీ ఎన్నికల్లో అందరికంటే ముందుగా 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని ప్రారంభించినా ఫలితం లేకుండా పోయింది.
అక్రమంగా ఇరికించారంటూ...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తనను అక్రమంగా ఇరికించారని, తనను జైల్లో పెట్టి వేధించారని చెబుతూ సానుభూతిని తెచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ పై నమ్మకంతో మూడు సార్లు ఢిల్లీ ప్రజలు గెలిపించినా కేంద్ర ప్రభుత్వం మీద నెపం మోపుతూ ఎప్పటికప్పడు తన తప్పు లేదని, తప్పందతా బీజేపీ అని బూచిగా చూపించే ప్రయత్నం చేశారు. దీనికి తోడు కాంగ్రెస్ ను తక్కువగా అంచనా వేశారు. కాంగ్రెస్ ను కలుపుకుని పోకుండా అధికారాన్ని దూరం చేసుకున్నారు. ఆమ్ ఆద్మీపార్టీకి, కాంగ్రెస్ కు వచ్చిన ఓట్ల శాతాన్ని కలిపితే బీజేపీని నిలువరించే అవకాశం ఉండేది. కానీ జైల్లో ఉన్న ప్పుడు తనకు అండగా నిలిచిన కాంగ్రెస్ ను కాదని ఒంటరిగా పోటీ చేయడమే చేటు తెచ్చిపెట్టిందన్నది వాస్తవం.
Next Story