Fri Dec 05 2025 22:37:28 GMT+0000 (Coordinated Universal Time)
Plane Crash : విమాన ప్రమాదానికి గల అవకాశాలు ఏంటి? పైలట్ నిస్సహాయంగా మారారా?
అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో రెండు ఇంజిన్లు ఫెయిల్ అవ్వడానికి అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు

అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో రెండు ఇంజిన్లు ఫెయిల్ అవ్వడానికి అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. రెండు ఇంజిన్లు ఒకేసారి ఫెయిల్ అయ్యే అవకాశం చాలా అరుదుగా సంభవిస్తుందని చెబుతున్నారు. పైలెట్ సుమిత్ అగర్వాల్ కూడా చివరినిమిషంలో సరిచేయడానికి వీలులేనిసమస్య తలెత్తడంతోనే మేడే కాల్ ఇచ్చి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఢిల్లీ నుంచి మామూలుగానే బయలుదేరి వచ్చిన ఈ బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ లో టేకాఫ్ అయిన వెంటనే ప్రమాదానికి లోను కావడం అంటే ఏదో జరిగి ఉంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. అయితే ప్రమాదం జరిగిన తీరును బట్టి కారణాలను కనిపెట్టలేం.
తనిఖీలు చేసిన తర్వాతనే...
ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు వచ్చే సమయంలోనే విమానంలో ఏసీలు పనిచేయకపోవడాన్ని ఒక ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అంటే విమానంలో సాంకేతిక లోపం తలెత్తడానికి ముందు ఇలాంటివి ఏమైనా జరుగుతుంటాయా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ నిపుణులు మాత్రం వీటిని చెక్ చేసిన తర్వాత మాత్రమే ఫ్లైట్ వెళ్లేందుకు అనుమతించారని, అంతర్జాతీయ విమానయానికివెళ్లే ప్రతి ఫ్లైట్ ను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో దాదాపు రెండు గంటల పాటు విమానం ఉండటంతో అంతా చెక్ చేసిన తర్వాత మాత్రమే టేకాఫ్ కు అనుమతిచ్చారని చెబుతున్నారు. అన్ని పరీక్షించిన తర్వాతనే స్టార్టప్ పర్మిషన్ ఏటీసీ ఇస్తుంది. టేకాఫ్ అయిన దగ్గర నుంచి డెస్టినేషన్ వరకూ రూట్ క్లియర్ గా ఉంటేనే అనుమతి ఇస్తారు.
సాంకేతిక లోపం వల్లనేనా?
విమానం కూలిన పరిస్థితులను, అంతకు ముందు ప్రయాణికుడు పెట్టిన వీడియోలు చూస్తే విమానం కండిషన్ సరిగా లేదని అర్థమవుతుందని కూడా కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టేకాఫ్ కు బయలుదేరి 650 అడుగులకు ఎగిరిన తర్వాత ఇక పైకి ఎగరలేకపోయిందంటే అది ఖచ్చితంగా సాంకేతిక లోపమే కారణమని అంటున్నారు. పక్షులు ఢీకొని ప్రమాదం జరిగిందన్న విషయాన్ని పూర్తిగా ధృవీకరించలేమన్నారు. ఎందుకంటే రెండు ఇంజిన్లు ఉండటంతో పక్షి వచ్చి ఇంజన్ లో పడినా మరొక ఇంజిన్ తో నడిపే అవకాశముందని చెబుతున్నారు. ఈ విమానం తక్కువ వేగంలోనూ ఎగరగల శక్తి ఉందని, కానీ పూర్తి సమాచారం మాత్రం దర్యాప్తు తర్వాత మాత్రమే తెలియనుంది. అప్పటి వరకూ ఈ ప్రమాదం పై అన్ని కోణాల్లో విచారించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Next Story

