Fri Dec 05 2025 11:15:50 GMT+0000 (Coordinated Universal Time)
Vice President Election : ఉప రాష్ట్రపతి ఎన్నికతో ఇరకాటం తప్పదా? గెలుపోటములతో సంబంధం లేదా?
భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక ఫలితం ముందుగానే తెలిసినా పోటీ తప్పడం లేదు. నిజానికి ఉప రాష్ట్రపతి పదవి అంటే రాజకీయాలకు అతీతంగా ఎన్నుకోవాలి

భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక ఫలితం ముందుగానే తెలిసినా పోటీ తప్పడం లేదు. నిజానికి ఉప రాష్ట్రపతి పదవి అంటే రాజకీయాలకు అతీతంగా ఎన్నుకోవాలి. అయితే గత కొన్ని దశాబ్దాలుగా మన పాలకులు రాజకీయ నేతలనే ఉప రాష్ట్రపతిగా చేయడం ప్రారంభించారు. దీంతో ఈ ఎన్నికలోనూ రాజకీయాలు చొరబడ్డాయి. నిజానికి పార్లమెంటు సభ్యులు పార్టీలకు అతీతంగా తమ ఆత్మప్రభోదం మేరకు ఓటు వేయాల్సి ఉంటుంది. పోటీ చేసే అభ్యర్థి వ్యక్తిత్వం, ట్రాక్ రికార్డుతో పాటు రాజ్యాంగాన్ని కాపాడగలరన్ననమ్మకం కలిగే వ్యక్తినే ఎన్నుకోవాల్సి ఉంటుంది. అలాంటి ఉప రాష్ట్రపతి ఎన్నిక గత కొన్ని దశాబ్దాలుగా ఎవరు అధికారంలో ఉంటే వారు మద్దతు ఇచ్చిన వారే ఎన్నికవుతూ వస్తున్నారు.
సంఖ్యాపరంగా చూస్తే...
ప్రస్తుతం కూడా సంఖ్యాపరంగా చూస్తే ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ ఎన్నిక లాంఛనమే. అయితే అదే సమయంలో ఇండి కూటమి బలపర్చిన అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మచ్చ లేని వ్యక్తి. ప్రొఫెషనల్ గా, పర్సనల్ గా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని వ్యతిరేకించే వారు ఎవరూ లేరు. పార్టీలకు అతీతంగా ఆయనను అభిమానించే వారు చాలా మంది ఉన్నారు. అలాగే ఎన్డీఏ అభ్యర్థి రాధా కృష్ణన్ కూడా సౌమ్యుడే. ఆయన కూడా ఎలాంటి వివాదాలకు పోకుండా రాజకీయాలను నెరిపిన నేత. పదహారేళ్లకే ఆర్ఎస్ఎస్ లో చేరి తర్వాత జన్ సంఘ్ తర్వాత బీజేపీలో చేరి ఆయన పార్లమెంటు సభ్యుడిగా రెండుసార్లు గెలిచారు. ఆయనను కూడా తక్కువగా చేసి ఎవరూ చూడలేరు.
వారిద్దరి గెలుపు కాదన్నది...
కానీ ఇది కేవలం వారిద్దరి గెలుపోటములకు సంబంధించిన విషయం మాత్రం కాదు. ఎన్నిక అంటే గెలుపు ఎంత సహజమో.. ఓటమి అంతే సహజం. ఓటమి చెందిన వారిని తక్కువ చేసి చూసే అవకాశం ఈ ఎన్నికల్లో మాత్రం కనిపించదు. నిజానికి ఉప రాష్ట్రపతిని రాజ్యసభ, లోక్ సభ సభ్యులు ఎన్నుకుంటారు. మొత్తం 781 మంది సభ్యులున్న ఉభయ సభల్లో ఎలక్టోరల్ కాలేజీలో గెలుపున కు కావాల్సిన ఓట్లు 391 మాత్రమే. ఎన్డీఏ కూటమిక లోక్ సభలో 293, రాజ్యసభలో 132 మంది సభ్యులున్నారు. దీంతో పాటు వైసీపీ మద్దతు ప్రకటించడంతో బలం 432కు పెరిగింది. ఇండి కూటమి ఉభయ సభల్లో కేవలం 311 మాత్రమే. అంకెలు చూస్తేనే గెలుపు ఎవరిదో అర్థమవుతుంది. అదే సమయంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి వంటి వారికి మద్దతు ఇవ్వకుండా ఉండే పార్టీలను ఆ యా రాష్ట్రాల్లో ఇరకాటంలో నెట్టేందుకు ఇండి కూటమి వ్యూహాత్మకంగా సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసిందనుకోవాలి.
ఇద్దరూ దక్షిణాదికి చెందిన...
మరొకవైపు ఈ ఎన్నికతో రెండు కూటములు దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లయింది. భవిష్యత్ లో దక్షిణాదిలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు నిలదొక్కుకోవడానికి ఈ ఎన్నికను ఉపయోగించుకోవాలని రాజకీయ ఎత్తుగడతోనే ఎంపిక చేసినట్లుంది. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన వ్యక్తికాగా, ఇండి కూటమి వ్యక్తి తెలంగాణకు చెందిన న్యాయకోవిదుడు. దీంతో దక్షిణ భారత దేశంలోనే పొరుగు రాష్ట్రాల వారిని ఎంపిక చేయడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలకు చెక్ పెట్టడానికే ఈ ఎంపిక అని అనుకోవాల్సి ఉంటుంది. రాధాకృష్ణన్ ను ఎంపిక చేసి తమిళనాడులో డీఎంకేను, సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడం ద్వారా బీఆర్ఎస్, టీడీపీ, జనసేన, వైసీపీలను ఇరకాటంలోకి నెట్టాయన్నది వాస్తవం. ఎన్నిక ఫలితం ముందుగానే తెలిసినా జరగబోయే రాజకీయ పరిణామాలకు ఈ ఎన్నిక ఒక దిక్సూచిగా మారుతుందన్నది వాస్తవం.
Next Story

