Sat Dec 13 2025 22:33:12 GMT+0000 (Coordinated Universal Time)
Delhi Bomb Blast : బాంబు పేలుళ్ల వెనక భారీ కుట్ర... ఎర్రకోట లక్ష్యం.. అసలు టార్గెట్ అదే
ఢిల్లీలో బాంబు పేలుళ్ల కేసులో నిర్ఘాంతపడే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఢిల్లీలో బాంబు పేలుళ్ల కేసులో నిర్ఘాంతపడే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రకోటను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం రోజున ఈ పేలుళ్లు జరపాలని ప్లాన్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది. అలాగే ఎర్రకోట సమీపంలో అనేక సార్లు ఉగ్రవాదుల రూపంలో ఉన్న వైద్యులు రెక్కీని నిర్వహించినట్లు కూడా పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది. డాక్టర్ ముజమ్మిల్ గనయీ ఈ రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. అయితే అక్కడ భారీ బందోబస్తు ఉండటంతో డిసెంబరు 6వ తేదీన ఎర్రకోట సమీపంలోనే పేలుళ్లకు పాల్పడాలని కుట్ర జరిగినట్లు కూడా విచారణలో వెల్లడయింది. ఎర్రకోటతో పాటు అయోధ్యలో కూడా బాంబు పేలుళ్లు జరపాలని ముష్కరులు ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడయినట్లు అధికారిక వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
ఉగ్రదాడిగా ప్రకటించి...
ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుళ్లు దేశాన్ని కుదిపేసింది. బుధవారం ఈ ఘటనను ఉగ్రదాడిగా కేంద్రం ప్రకటించింది. 12 మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. దర్యాప్తు సంస్థలు అంతర్జాతీయ సంబంధాలు బయటపెట్టాయి. టర్కీ, ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న హ్యాండ్లర్లు ఈ కుట్ర వెనుక ఉన్నారని ప్రాథమికంగా తెలిసింది. ఈ మాడ్యూల్‌కు నిషేధిత జైష్–ఇ–మహ్మద్‌తో సంబంధాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. డాక్టర్ మాడ్యూల్’గా పిలవబడే ఈ గ్రూపులో ఉన్నవారు అధిక విద్యావంతులు కావడం ప్రత్యేకతగా చెబుతున్నారు. దర్యాప్తు సంస్థల వివరాల ప్రకారం, పేలుడు కారును నడిపిన డాక్టర్ ఉమర్ నబీ అసలు డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం నాడు పెద్ద దాడి చేయాలని భావించాడు.
అనేక సార్లు రెక్కీ జరిపి...
కానీ అతని సహచరుడు డాక్టర్ ముజమ్మిల్ గనయీ అరెస్టవడంతో పథకం విఫలమైందని అధికారులు తెలిపారు. గనయీ గదిలో 360 కిలోల అమోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకున్న తర్వాత నబీ గందరగోళానికి లోనై కారులోనే పేలుడుకు పాల్పడినట్లు పోలీసులు ప్రాధమిక విచారణలో నిర్ధారించారు. ఫోరెన్సిక్ నిపుణులు పేలుడు పదార్థాల నమూనాలను విశ్లేషిస్తున్నారు. రిమోట్ సిగ్నల్ పరికరాన్ని ఉపయోగించి హ్యాండ్లర్లతో సంబంధం కొనసాగించారా అన్నది కూడా పరీక్షిస్తున్నారు.దర్యాప్తులో ఉమర్, గనయీలు జనవరిలో ఎర్రకోట పరిసరాల్లో పలు మార్లు పరిశీలన చేసినట్లు మొబైల్ టవర్, సీసీటీవీ డేటాతో ధృవీకరించారు. రిపబ్లిక్ డే సందర్భంగా దాడి చేయాలని ఈ గుంపు ప్రణాళిక సిద్ధం చేసిందని అనుమానం వ్యక్తమైంది.
26/11 తరహా దాడులకు...
దర్యాప్తు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... 2021లో వీరిద్దరూ టర్కీకి వెళ్లిన సమయంలోనే తీవ్రవాద భావాలకు ఆకర్షితులయ్యారు. అక్కడ జైష్ హ్యాండ్లర్ ఉమర్ బిన్ ఖత్తాబ్ ఆధ్వర్యంలోని టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరిన తర్వాత ఉగ్రపంథాను అనుసరించడానికి సిద్ధమయ్యారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా 26/11 తరహా దాడులకు సిద్ధమవ్వాలని ఆదేశాలు అందుకున్నారని చెబుతున్నారు. పేలుడుకు ముందు ఉమర్ నబీ ఢిల్లీలోని ఆసఫ్ అలీ రోడ్డులోని మసీదులో సాయంత్రం మూడు గంటలపాటు ప్రార్థనలు చేసి, 3.19 గంటలకు సునెహ్రి మసీదు పార్కింగ్‌లో కారును ఉంచాడు. సాయంత్రం 6 గంటల తర్వాత బయటకు వచ్చాడు. పేలుడు అనుకోకుండా సంభవించిన ఫిదాయీన్ తరహా దాడిగా భావిస్తున్నారు. ఫరీదాబాద్‌లో నబీ పేరుతో నమోదైన మరో ఎరుపు కారు స్వాధీనం చేసుకున్నారు. చిరునామా నకిలీగా గుర్తించారు. కారు కొనుగోలుకు నకిలీ పత్రాలు వాడినట్లు తేలింది. కారు విక్రేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story

