Fri Dec 05 2025 12:41:14 GMT+0000 (Coordinated Universal Time)
Dharmasthala : కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో ఆ పుర్రెలు? ఎముకలు ఎవరివి? ఎవరు చంపారు?
కర్ణాటక రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ధర్మస్థల ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది

కర్ణాటక రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ధర్మస్థల ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దర్మస్థలకు రోజుకు వేల మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ మంజునాధస్వామి దేవాలయానికి దేశం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా ప్రపంచంలోని పర్యాటకులు కూడా ఇక్కడకు వస్తుంటారు. స్వామి అయ్యప్ప మాలను వేసుకున్న భక్తులు పుణ్యక్షేత్రాల దర్శనల్లో భాగంగా ఖచ్చితంగా ధర్మస్థలికి వస్తారు. గోవా కు వెళ్లే మార్గం కావడంతో పర్యాటకులు అధిక సంఖ్యలో వెళుతూ దారి మధ్యలో ఉన్న ధర్మస్థలిలో ఉన్న మంజునాధ స్వామి ఆలయాన్ని సందర్శించుకుని పూజలు నిర్వహించి వెళతారు. ఇక్కడ సముద్ర తీరం కూడా ఉండటంతో పర్యాటకుల సంఖ్య నిత్యం ఎక్కువగా ఉంటుంది. రద్దీ కూడా అధికంగానే ఉంటుంది.
పదమూడు ప్రాంతాల్లో...
అటువంటి ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ధర్మస్థలిలో పుర్రెలు, ఎముకలు ఎక్కువ సంఖ్యలో ప్రత్యేక దర్యాప్తు అధికారుల బృందానికి లభించడం విస్మయాన్ని కలిగించింది. మహిళలను కొందరు దారుణంగా హింసించి, అత్యాచారం చేసి హత్య చేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. అయితే మృతదేహాల అవశేషాలను వెలికితీయడంలో ఒకింత జాప్యం జరుగుతుందని, వర్షం కారణంగా వెలికితీత కార్యక్రమాలు ఆలస్యమవుతున్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ పెద్దయెత్తున మహిళలు హత్యకు గురయ్యారన్న విషయం గతంలో పపారిశుధ్య కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు మొదలు పెట్టారు. గత రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో నాలుగు వందల యాభై మంది అదృశ్యమయినట్లు వివిధ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదులు అందాయి.
450 మంది అదృశ్యం...
ఈ పారిశుధ్య కార్మికుడు ఎన్నో శవాలను పూడ్చి పెట్టినట్లు జిల్లా ఎస్సీకి లేఖ కూడా రాశారు. 1998 నుంచి 2014 వరకూ వందకు పైగా మృతదేహాలనను తానే పూడ్చిపెట్టినట్లు ఆ లేఖలో పేర్కొన్నాడు. అయితే కొందరు వ్యక్తులు తన కుటుంబానికి చెందిన యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో తాము అక్కడి నుంచి వెళ్లపోయామని, కానీ చేసిన పాపం చెప్పుకుంటే పోతుందని, అందుకే తాను ఈ విషయాలను వెల్లడిస్తున్నానని లేఖలో పేర్కొన్నాడు. మరొకవైపు రెండు దశాబ్దాల క్రితం దర్మస్థలకు వచ్చిన తమ కుమార్తె కనిపించకుండా పోయిందంటూ సుజాత భట్ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నలుగురు ఐపీఎస్ లతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. పారిశుధ్య కార్మికుడు చెప్పిన పదమూడు ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. మరి ఈ దారుణానికి ఎవరు ఒడిగట్టారన్నది సిట్ తేల్చనుందా? లేక కేసు నీరుగారుతుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
Next Story

