Tue Dec 16 2025 09:54:46 GMT+0000 (Coordinated Universal Time)
Delhi : ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. ప్రమాదకర స్థాయిలో కాలుష్యం
ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. వాయు కాలుష్యం కూడా పెరిగింది.

ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. వాయు కాలుష్యం కూడా పెరిగింది. ఉదయం నుంచి ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. విజుబులిటీ గా పడిపోవడంతో పలు విమానాలను రద్దుచేశారు. మరికొన్ని విమానాలను దారి మళ్లించారు. ఢిల్లీలో ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 498కి చేరగా, సాయంత్రానికి 427 వద్ద స్థిరపడింది. ఇది ప్రమాదకరమైన స్థాయిగా అధికారులు పేర్కొన్నారు. తీవ్ర పొగమంచు కారణంగా దిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 60కిపైగా విమానాలు రద్దుకాగా, ఐదు విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు.
విమానాలు రద్దు...
మరో 250కిపైగా విమానాలు ఆలస్యమయ్యాయి. ఉదయం 10 గంటల తర్వాత కూడా దట్టమైన పొగమంచు కారణంగా కార్యకలాపాలు ప్రభావితమవుతున్నాయని విమానాశ్రయ నిర్వాహక సంస్థ డయల్ ఎక్స్‌లో వెల్లడించింది. ప్రయాణికులకు అవసరమైన సహాయం అందించేందుకు తమ సిబ్బంది అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నారని తెలిపింది. నగరంలో అధిక కాలుష్య పరిస్థితుల నేపథ్యంలో ఐదో తరగతి వరకు విద్యార్థులకు హైబ్రిడ్ విధానాన్ని నిలిపివేసి పూర్తిగా ఆన్లైన్ బోధనకు మారాలని ఢిల్ల్లీ ప్రభుత్వం ఆదేశించింది.
ప్రమాదకర స్థాయిలో...
సీపీసీబీ వివరాల ప్రకారం నగరంలోని 27 గాలి నాణ్యత కొలిచే కేంద్రాల్లో ప్రమాదకర స్థాయిలో నమోదైంది. మరో 12 కేంద్రాల్లో ‘వెరీ పూర్’గా నమోదైంది. వజీర్పూర్ కేంద్రంలో రోజంతా గరిష్ఠంగా 500 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గా నమోదైంది. ఈ స్థాయికి మించి సీపీసీబీ డేటాను నమోదు చేయదని అధికారులు తెలిపారు. ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ప్రకారం PM2.5 స్థాయి 154.96 మైక్రోగ్రామ్‌లు క్యూబిక్ మీటర్‌కు చేరగా, PM10 స్థాయి 260.9గా నమోదైంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని బయటకు రావాలని కోరింది.
Next Story

