Wed Feb 18 2026 10:27:17 GMT+0530 (India Standard Time)
Delhi : ఢిల్లీలో ట్రాఫిక్ సమస్యకు కొత్త ప్రయోగం.. ఏఐ ఆధారిత వ్యవస్థకు అనుసంధానం
దేశ రాజధాని ఢిల్లీలో వాహనం కదలాలంటే కుదరని పని.

దేశ రాజధాని ఢిల్లీలో వాహనం కదలాలంటే కుదరని పని. ఏ రోడ్డు చూసినా ట్రాఫిక్ సమస్య. ఎక్కడైనా గంటల తరబడి రోడ్డు మీద వాహనంతో నిలబడాల్సిందే.పర్యావరణ కాలుష్యం, సుదీర్ఘ ప్రయాణ సమయం, పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ సమస్యలను తగ్గించేందుకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. న్యూఢిల్లీలో ఏఐ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థ ప్రవేశపెట్టాలంటూ కేంద్ర హోం మంత్రిత్వశాఖకు ప్రతిపాదన పంపారు. ఈ ప్రణాళికలో భాగంగా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ గుర్తింపు కెమెరాలు ఏర్పాటు చేస్తారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను ఇవి గుర్తిస్తాయి. మూడేళ్లలో దశలవారీగా ఆటోమేటిక్ చలాన్లు జారీ చేసే విధానం అమలు చేస్తారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రతిపాదన దశలోనే ఉంది. అమల్లోకి వస్తే నగర ట్రాఫిక్ నిర్వహణలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశముంది.
రియల్ టైమ్ ట్రాఫిక్ ...
ప్రయాణికులకు రియల్‌టైమ్ ట్రాఫిక్ సమాచారం అందుతుంది. వాహనాల సగటు వేగం, రద్దీ స్థాయిని బట్టి సిగ్నళ్లు ఆటోమేటిక్ గా పనిచేస్తాయి. మాన్యువల్ తనిఖీలపై ఆధారపడే పరిస్థితి తగ్గి, నిబంధనల పాటించడం మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంది. వాహనాల కాలుష్యం కూడా తగ్గవచ్చని అంచనా. ఇంధన ఖర్చు భారం కొంత మేర తగ్గుతుందని చెబుతున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నప్పటికీ వాహనాలు క్రమపద్ధతిలో పంపించేందుకు ఏఐ టెక్నాలజీ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇది సక్సెస్ అయితే ఇదే పద్ధతిని రద్దీ ఉన్న అన్ని ప్రాంతాల్లో కొనసాగించవచ్చు. ముందుగా ప్రయోగాత్మకంగా కొన్ని రద్దీ ప్రాంతాల్లోనే ఏఐ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నారు.
సింగపూర్ వంటి దేశాల్లో...
మొదటి దశలో ఐదు కారిడార్లలో 250 అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్ జంక్షన్లు, 271 పాయింట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటి ఏఐ ట్రాఫిక్ వ్యవస్థలు ఇప్పటికే అమలులో ఉన్నాయి. సింగపూర్‌లో ఈ విధానం ట్రాఫిక్ నియంత్రణలో ఫలితాలు ఇచ్చిందని అధికారులు సూచిస్తున్నారు.ప్రతి ఏడాది ఫార్ములా వన్ పోటీ సమయంలో సుమారు మూడు లక్షల మంది సింగపూర్‌ను సందర్శిస్తారు. దేశం చిన్నదైనా భారీ జనసందోహాన్ని సమర్థంగా నియంత్రించగలుగుతోంది. పెద్దగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురుకావడం లేదని ఉదహరిస్తన్నారు. దీంతో పోలిస్తే 2023లో హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ రేస్ సందర్భంగా అనేక డైవర్షన్లు చేపట్టారు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ రద్దీ పెరిగింది. ఇలాంటి పరిస్థితులు తగ్గించేందుకు ఏఐ ట్రాఫిక్ వ్యవస్థలు ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే రెండో, మూడో దశల్లో ఢిల్లీ నగరవ్యాప్తంగా విస్తరించాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. మరి చూడాలి ఈ ప్రయోగం ఎలా సక్సెస్ అవుతుందో?
Next Story

