Wed Jul 16 2025 23:28:06 GMT+0000 (Coordinated Universal Time)
Covid Alert : భారత్ లో మోత మోగిస్తున్న కరోనా.. వారం రోజుల్లోనే ఎన్ని కేసులో తెలుసా?
భారత్ లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో మూడు వేలకు పైగానే కేసులు నమోదయ్యాయి

భారత్ లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో మూడు వేలకు పైగానే కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా కోవిడ్ వైరస్ సోకి నలుగురు మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ధృవీకరించింది. తాజాగా ఢిల్లీలో అరవై ఏళ్ల మహిళ కరోనా వైరస్ సోకి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. శనివారం ఒక్కరోజే దాదాపు 682 కేసులు దేశ వ్యాప్తంగా నమోదవుతుండటంతో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్య శాఖ అధికారులు కూడా భావిస్తున్నారు. ఇక వర్షాకాలం కావడంతో కోవిడ్ కేసులు మరింత పెరిగే వాతావరణం ఉందని అభిప్రాయపడుతున్నారు. వర్షాకాలం కావడంతో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతాయన్న అంచనాలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.
యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం భారత్ లో 3,395 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మే 25వ తేదీ నుంచి భారత్ లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని తెలిపింది. ఒక్కసారిగా కేసుల సంఖ్య పది రెట్లు పెరిగాయని అంటుంది. మే 25వ తేదీ నాటికి పదుల సంఖ్యలో కరోనా వైరస్ కేసులు భారత్ లో ఉంటే ఇప్పుడు మూడు వేల కేసులు దాటడం పట్ల కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రధానంగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ గుజరాత్, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. కేరళలో ఇప్పటికే మాస్క్ లను కంపలర్సరీ చేశారు. కేరళలో అత్యధికంగా 1,336 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 467 కేసులు నమోదయ్యాయి.
లక్షణాలివే...
ఢిల్లీలో 375, గుజరాత్ లో 265, కర్ణాటకలో 234, పశ్చిమ బెంగాల్ లో 205, తమిలనాడులో 185, ఆంధ్రప్రదేశ్ లో పదహారు, కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఒక్క కేసు మాత్రమే నమోదయింది. అయితే ఈ వేరియంట్ ప్రమాదకరమైనది కాదని చెబుతున్నారు. అలాగే వాసన కోల్పోవడం లేదని, జ్వరం, విరోచనలు, వాంతులు, ఒళ్లునొప్పులు, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్నాయని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అన్ని ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాల్సిందేనని తెలిపారు. మాస్క్ లు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించడంతో పాటు బయటకు వెళ్లి వచ్చిన తర్వాత శానిటైజర్స్ తో చేతులు శుభ్రపర్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
Next Story