Tue Jul 15 2025 16:10:00 GMT+0000 (Coordinated Universal Time)
Corona Alert : కోవిడ్ యాక్టివ్ కేసులు భారత్ లో పెరుగుతున్నాయ్.. అలెర్ట్
భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అర్థమవుతుంది.

భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అర్థమవుతుంది. మే 25వ తేదీ తర్వాత దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఐదు రెట్లు పెరిగాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం భారత్ లో 2700 యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసులు భారత్ లో పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా ఏడుగురు కరోనా వైరస్ తో మృతి చెందినట్లు చెబుతున్నారు. అదే సమయంలో కొన్ని రాష్ట్రాల్లో విపరీతంగా పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది.
అత్యథికంగా ఈ రాష్ట్రాల్లోనే...
భారత్ లో ప్రస్తుతం 2,700 యాక్టివ్ కేసులున్నాయి. అత్యధికంగా కేరళలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీల్లో కూడా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. వాతావరణం చల్లబడటం, నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు పడుతుండటంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇంకా పెరిగే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు అప్రమత్తమై కోవిడ్ వార్డులను ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కోవిడ్ బాధిత రోగులకు వైద్యం అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో అన్ని రాష్ట్రాలూ ఆ దిశగా చర్యలు ప్రారంభించాయి.
ప్రమాదం కాదంటున్నా...
ఈ వైరస్ అంత ప్రమాదకరం కాదని చెబుతున్నప్పటికీ దీర్ఘకాలిక రోగులు, గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలకు వెళ్లే సమయంలో ఖచ్చితంగా మాస్క్ లను ధరించాలని చెబుతుంది. అదే సమయంలో చేతులను బయటకు వెళ్లివచ్చినప్పుడు శుభ్రంచేసుకోవడం మర్చిపోవద్దని, భౌతిక దూరం పాటించడం మంచిదని కూడా కూడా చెబుతున్నారు. ఈ కోవిడ్ తో జలుబు, దగ్గు, జ్వరం, విరేచనాలతో పాటు గొంతు బొంగురుపోవడం, ఆయాసం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, ఈ లక్షణాలను కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి సకాలంలో చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.
Next Story