Fri Dec 05 2025 13:41:46 GMT+0000 (Coordinated Universal Time)
Covid Virus : కోవిడ్ మళ్లీ బ్రేక్ అవుతుందా? క్వారంటైన్ లో ఎంత మంది ఉన్నారో తెలుసా?
భారత్ లో కరోనా వైరస్ మళ్లీ పొంచి ఉంది. రూపం మార్చుకుని కొత్త వేరియంట్లలో దూసుకు వస్తుంది

భారత్ లో కరోనా వైరస్ మళ్లీ పొంచి ఉంది. రూపం మార్చుకుని కొత్త వేరియంట్లలో దూసుకు వస్తుంది. జేఎన్ 1 వేరియంట్ కేసులే ఎక్కువ గా నమోదవుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. ఎల్ఎఫ్.7 వేరియంట్ కేసులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దేశంలో కరోనా కేసులు ఎక్కువ కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. అన్ని రాష్ట్రాలకు గైడ్ లైన్స్ పంపింది. తగిన వైద్య సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా కోవిడ్ వార్డులను ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. అయితే అంతగా భయపడాల్సిన అవసరం లేదని, ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ ప్రమాద తీవ్రత తక్కువేనని తెలిపింది.
ఆరు రాష్ట్రాల్లో...
కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కొన్ని కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కేరళలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో పదహారు పాజిటివ్ కోవిడ్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. దీంతో కేరళలో మాస్క్ ను తప్పనిసరి చేశారు. జనసమ్మర్దం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్క్ లు ధరించాలని, అవసరమైతే తప్ప జనం ఎక్కువగా ఉండే చోటకు వెళ్లవద్దని కూడా వైద్యులు సూచిస్తున్నారు. స్వీయ జాగ్రత్తలు తీసుకోకుంటే కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతుందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురికి పాజటివ్ గా నిర్ధారణ అయింది. విశాఖపట్నం, కడప జిల్లాల్లో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఒక కేసు మాత్రమే ఇప్పటి వరకూ నమోదయింది.
ఆందోళన అవసరం లేదని...
కరోనా వైరస్ సోకిన వారిని క్వారంటైన్ లోనే ఉంచి ఎక్కువగా చికిత్స అందిస్తున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, గొంతు మంట, ఒళ్లునొప్పులతో బాధపడే వారు ఖచ్చితంగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకూ ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగా ఉందని, ఒకే ఒక మరణం సంభవించినా అతనికి క్యాన్సర్ ఉండటంతో మరణించాడని అధికారులు తెలిపారు. పెద్దగా భయపడాల్సిన పనిలేకపోయినప్పటికీ ప్రజలు ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వాలు కూడా ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తూ తగిన ఏర్పాట్లుచేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్ వ్యాప్తి చెందదని చెబుతెన్నారు.
Next Story

