Wed Jul 16 2025 23:36:29 GMT+0000 (Coordinated Universal Time)
Corona Virus : పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయ్.... జాగ్రత్తగా ఉండాల్సిందే
భారత్ లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే నాలుగు వేల యాక్టివ్ కేసులకు చేరుకోవడంతో ఆందోళన చెందుతున్నారు.

భారత్ లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే నాలుగు వేల యాక్టివ్ కేసులకు చేరుకోవడంతో ఆందోళన చెందుతున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య గత నెల 25వ తేదీ నుంచి ఎక్కవుగా పెరుగుతుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ భారత్ లో ఈఏడాది జనవరి నుంచి 32 మంది వరకూ కరోనా వైరస్ తో మరణించారని ఆరోగ్య ాఖ అధికారులు తెలిపారు. ఈ వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
యాక్టివ్ కేసులు పెరుగుతూ...
ఇప్పటికే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కేరళలో 1435 నమోదయ్యాయి. మహారాష్ట్రలో 506, ఢిల్లీలో 483, పశ్చిమ బెంగాల్ లో 339, గుజరాత్ లో 338, తమిళనాడులో 199, ఉత్తర్ ప్రదేశ్ లో 149 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వీరిలో ఎక్కువ మంది హోం ఐసొలేషన్ లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగా ఉండటం కొంత ఊరట కల్గించేదయినప్పటికీ ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మాస్క్ లను ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ల వాడకం వంటి చర్యలతో వైరస్ కు అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు.
రాష్ట్రాలకు ఆదేశం...
అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కోవిడ్ కోసం ప్రత్యేకంగా పడకలను ఏర్పాటు చేసుకోవాలని, దీంతో పాటు ఆక్సిజన్ సిలిండర్లను కూడా అందుబాటులో ఉంచుకునేలా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ వేరియంట్ పెద్ద ప్రమాదకరమైనది కాదని వైద్య శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ మరణాలు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వాలు తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించింది. తొలుత హాంకాంగ్ లో ప్రారంభమైన ఈ కోవిడ్ వేరియంట్ తర్వాత క్రమంగా భారత్ లోకి ప్రవేశించిందంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, వృద్ధులు, గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Next Story