Thu Jul 17 2025 00:07:00 GMT+0000 (Coordinated Universal Time)
Corona Alert : వేగంగా వ్యాప్తి చెందుతోన్న కరోనా . క్వారంటైన్ కు సిద్ధమవ్వాల్సిందేనా?
కరోనా వైరస్ కేసులు దేశ వ్యాప్తంగా పెరుగుతున్నాయి

కరోనా వైరస్ కేసులు దేశ వ్యాప్తంగా పెరుగుతున్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో ఇరవై మూడు కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్ కావడంతో తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరింది. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా టెన్షన్ పట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ లో తాజాగా మరో రెండు కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. విశాఖ, కడప జిల్లాల్లో కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఒక కేసు నమోదయింది.
ఎప్పటి నుంచో ఉందని...
అయితే 2023 నుంచి ఈ రకం వేరియంట్ జనంలో ఉందని వైద్యులు చెబుతున్నారు. ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని, వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే సరైన చర్యలు తీసుకుంటే కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చని చెబుతున్నారు. మాస్క్ లు ధరించడంతో పాటు శానిటైజర్ తో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడంతో పాటు భౌతిక దూరం కూడా పాటించాలని నిబంధనలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రద్దీ ప్రదేశాల్లో ఖచ్చితంగా మాస్క్ లను ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. భారత్ లోని ఇరవై రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయని తెలిపింది.
ప్రమాదకరమైనది కాదని...
ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడంతో పాటు క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందేలా ఏర్పాట్లు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మరొకవైపు ఇప్పటి వరకూ భారత్ లో కరోనా వైరస్ తో మరణం నమోదు కాలేదని భారత వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మవద్దని తెలిపింది. ఇది ప్రమాదకరమైన వేరియంట్ కాదని, దీనికి ఇంట్లో ఉండి చికిత్స చేసుకోవచ్చని సూచించింది. అయితే ప్రజలు మాత్రం గుమికూడకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని, స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. మొత్తం మీద కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మాత్రం మోగిస్తూనే ఉన్నాయి.
Next Story