Sat Jul 12 2025 22:48:26 GMT+0000 (Coordinated Universal Time)
Corona Virus : గుడ్ న్యూస్.. తగ్గుతున్న కరోనా వైరస్ కేసులు
కరోనా వైరస్ కేసులు భారత్ లో తగ్గుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుతుంది.

కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గత కొద్ది రోజులుగా అధికంగా కేసులు నమోదవుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతుంది. మే 25వ తేదీ నుంచి కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. వందల సంఖ్య నుంచి ఏడు వేల వరకూ చేరి ఆ తర్వాత కొంత శాంతించినట్లు కనపడుతుంది. క్రమంగా కేసుల సంఖ్య తగ్గుతుండటం నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. అలాగే డిశ్చార్జ్ అయ్యే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. వందకు మందికి పైగానే ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా మరణించడంతో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. ప్రజలతో పాటు ప్రభుత్వాలు కూడా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఎక్కువగా వ్యాప్తి ఉంటుందని...
అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అలెర్ట్ చేసింది. కోవిడ్ ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఆక్సిజన్ సిలండర్లతో పాటు అవసరమైన మందులను కూడా రెడీ చేసి పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ వేరియంట్ ప్రమాదకరం కాకపోయినప్పటికీ వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు మరణించే అవకాశముండటంతో ఈ రకమైన ఆదేశాలు జారీ చేసింది. ఇమ్యునిటీని పెంచుకునే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని కూడా భారత ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. వైరస్ వ్యాప్తి ఈ ఏడాది ఎక్కువగా ఉంటుందని అంచనాలు కూడా వినిపించాయి. వర్షాకాలం ముందే రావడం, నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడంతో చల్లటి వాతావరణంలో వైరస్ విజృంభిస్తుందని వైద్య నిపుణులు కూడా అభిప్రాయపడ్డారు.
తగ్గుతుండటంతో...
అయితే కొద్దిరోజులుగా కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుతుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశ వ్యాప్తంగా 179 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. అందులో అత్యధికంగా కర్ణాటకలో 105 కేసులున్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 6,836కు కు చేరుకుంది. వీటిలో అత్యధికంగా కేరళలో 1,659, కర్ణాటకలో 696, పశ్చిమ బెంగాల్ లో 747, గుజరాత్ లో 1,249 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ కరోనా వైరస్ కారణంగా 109 మంది మరణించారు. కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
Next Story