Wed Jan 21 2026 07:07:11 GMT+0000 (Coordinated Universal Time)
Cloud Burst : ఉత్తారాఖండ్ లో మరోసారి క్లౌడ్ బరస్ట్.. గల్లంతయిన వారెందరంటే?
ఉత్తారాఖండ్ లో మరోసారి క్లౌడ్ బరస్ట్ అయింది. ఒక్కసారిగా సంభవించిన వరదలతో అనేక మంది గల్లంతయ్యారు

ఉత్తారాఖండ్ లో మరోసారి క్లౌడ్ బరస్ట్ అయింది. ఒక్కసారిగా సంభవించిన వరదలతో అనేక మంది గల్లంతయ్యారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో నిన్న అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మెరుపు వరదలు సంభవించాయి. చమోలీ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో నివాసాలను వరదలతో ముంచెత్తాయి. వరద నీరు అర్ధరాత్రి ముంచెత్తడంతో నిద్రలోనే కొందరు గల్లంతయినట్లు అక్కడి ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. అదే సమయంలో వాహనాలు కూడా వరదల్లో కొట్టుకుపోయాయి.
ఇళ్లలో ఉన్నప్పుడే...
అనేక మంది ఇళ్లలో ఉన్నప్పుడు ఈ మెరుపు వరద రావడంతో ఒక్కసారిగా విరుచుకుపడిన వరదలో చిక్కుకుని చాలా మంది గల్లంతయినట్లు చెబుతున్నారు. సగ్వారా గ్రామంలో ఒక యువతి శిధిలాల కింద కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయినట్లు సహాయక బృందాలు తెలిపాయి. ఒక్కసారిగా కురిసిన వర్షంతో పాటు నిద్రలో ఉండగానే సంభవించడంతో తప్పించుకోవడానికి కూడా దారి లేక ప్రజలు చాలా మంది గల్లంతయ్యారని ఆ ప్రాంతంలో సహాయక చర్యలు నిర్వహిస్తున్న సహాయక బృందాలు చెబుతున్నాయి.
సహాయక చర్యలు...
క్లౌడ్ బరస్ట్ సంభవించిందన్న సమాచారం తెలిసిన వెంటనే సహాయక బృందాలు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గల్లంతయిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. కొందరు ఇళ్లలోనే ఉండి పోవడంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎంత మంది గల్లంతయ్యారన్నది లెక్క తెలియకున్నా పదుల సంఖ్యలోనే మిస్ అయినట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి పునరావ కేంద్రంలో ఉంచారు.
Next Story

