Tue Jan 20 2026 17:41:45 GMT+0000 (Coordinated Universal Time)
విద్యార్థిని చావబాదిన టీచర్లు.. ప్రైవేటు భాగాల్లో రక్తస్రావమై
విద్యార్థి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈస్ట్ చంపారణ్ జిల్లా మధుబన్ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి పదో తరగతి..

ఈ జనరేషన్ యువత చెడు వ్యసనాలకు త్వరగా బానిసలవుతున్నారు. స్కూల్ విద్యార్థులు నుంచి పెద్ద పెద్ద చదువులు చదివే వారి వరకూ.. ఆవారాగా తిరిగే వారి నుంచి.. ఆస్తులు, అంతస్తులు ఉన్నవారి వరకూ.. సిగరెట్లు, మద్యం, మాదకద్రవ్యాలకు అలవాటుపడుతున్నారు. అలా టెన్త్ చదివే ఓ విద్యార్థి బహిరంగంగానే పొగ తాగడాన్ని గమనించిన స్కూల్ టీచర్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ విద్యార్థిని బెల్టులతో విచక్షణా రహితంగా కొట్టడంతో అతను మృతి చెందాడు. ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది.
విద్యార్థి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈస్ట్ చంపారణ్ జిల్లా మధుబన్ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. శనివారం (జూన్24) ఉదయం రిపేర్ కు ఇచ్చిన తన తల్లి మొబైల్ ను తిరిగి తెచ్చేందుకు స్థానిక రిపేర్ షాపుకు వెళ్లాడు. తిరిగి వచ్చే సమయంలో స్నేహితులతో కలిసి పొగతాగాడు. అతను చదువుతున్న స్కూల్ చైర్మన్ విజయ్ కుమార్.. ఈ ఘటనను చూశారు. వెంటనే యువకుడి తండ్రిని పిలిపించి విషయం చెప్పారు.
అనంతరం యువకుడిని పాఠశాల ఆవరణలోకి ఈడ్చుకెళ్లి.. బెల్టులతో విచక్షణా రహితంగా చావబాదారు. ఇతర టీచర్లు కూడా తీవ్రంగా కొట్టడంతో.. అతను స్పృహ కోల్పోయాడు. వెంటనే స్థానిక ప్రైవేటు నర్సింగ్ హోమ్ కు తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ముజఫర్ పుర్ లో ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థి మరణించాడు. మెడ, చేతుల భాగాల్లో తీవ్రంగా గాయాలయ్యాయని, ప్రైవేటు భాగాల్లోనూ తీవ్రంగా రక్తస్రావం అయిందని మృతుని బంధువులు ఆరోపించారు. సదరు యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు.
Next Story

