Mon Dec 08 2025 13:32:06 GMT+0000 (Coordinated Universal Time)
ఇండిగో సంక్షోభం పై రామ్మోహన్ నాయుడు ఏమన్నారంటే?
ఇండిగో సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు

దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఇండిగో సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఇది పూర్తిగా ఇండిగో సంస్థ అంతర్గత సమస్యల వల్లే తలెత్తిందని, ప్రభుత్వ నిబంధనల వల్ల కాదని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో ఎంపీ ప్రమోద్ తివారీ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఇండిగో సంక్షోభాన్ని ప్రభుత్వం తేలిగ్గా తీసుకోవడం లేదని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు.
ప్రధాన కారణమేంటంటే?
ఈ సమస్యకు ప్రధాన కారణం ఇండిగో సిబ్బంది రోస్టరింగ్, అంతర్గత ప్రణాళిక వ్యవస్థలో ఉన్న లోపాలేనని రామ్మోహన్ నాయుడు తెలిపారు. కొత్తగా తెచ్చిన విమాన సిబ్బంది పనివేళల పరిమితి నిబంధనలతో ఎలాంటి సంబంధం లేదని రామ్మోహన్ నాయుడు వివరించారు. అందరితో చర్చించిన తర్వాతే ఈ నిబంధనలు రూపొందించామని, డిసెంబర్ 3 వరకు సర్వీసులు సజావుగానే నడిచాయని గుర్తుచేశారు.ఈ సంక్షోభం కారణంగా ప్రయాణికులు ఎదుర్కొన్న తీవ్ర అసౌకర్యానికి చింతిస్తున్నామని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇదే సమయంలో, విమాన టికెట్ ధరలు అడ్డగోలుగా పెంచకుండా ప్రభుత్వం పరిమితులు విధించిందని, ధరలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని సభకు హామీ ఇచ్చారు.
Next Story

