Thu Oct 31 2024 23:44:34 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : తెలంగాణలో నవంబరు 30న పోలింగ్
కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది
కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గడ్, మిజోరాం రాష్ట్రాలకు షెడ్యూల్ ను చీఫ్ ఎన్నికల కమిషన్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. మిజోరాంలో నలభై, తెలంగాణలో 119, మధ్యప్రదేశ్ 230, రాజస్థాన్ 200, ఛత్తీస్గడ్ లో 90 స్థానాలకు ఎన్నికల తేదీలను ప్రకటించారు. ఐదు రాష్ట్రాల్లో 679 అసెంబ్లీ స్థానాలున్నాయని ఆయన తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో 16.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఆయన చెప్పారు. కొత్తగా యువతరం అధికంగా ఓటర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఛత్తీస్గడ్ లో 2.03 కోట్ల మంది ఓటర్లున్నారని ఆయన చెప్పారు. ఎన్నికల వ్యయాన్ని పరిశీలించేందుకు ఎప్పటికప్పుడు పరిశీలకులు నియమిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో ప్రతి 897 మందికి ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
కొత్తగా ఓటర్లు...
ఐదు రాష్ట్రాల్లో అరవై లక్షల మంది కొత్త ఓటర్లుగా నమోదయ్యారని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో మహిళ ఓటర్ల సంఖ్య పెరిగిందని రాజీవ్ కుమార్ తెలిపారు. నేటి నుంచి ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని ఆయన తెలిపారు. పోలింగ్ స్టేషన్ల సంఖ్యను కూడా పెంచుతున్నామని తెలిపారు. వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం కల్పించామని చెప్పారు. తెలంగాణలో 3.17 కోట్ల మంది ఓటర్లున్నారని సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ లో 5.6 కోట్ల మంది ఓటర్లున్నారని చెప్పారు. రాజస్థాన్ లో 5.25 కోట్ల మంది ఓటర్లున్నారని చెప్పారు. ఐదు రాష్ట్రాల్లో 1.77 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఐదు రాష్ట్రాల్లో 940 చెక్పోస్టులను ఏర్పాటు చేసి సరిహద్దుల్లో తనిఖీలను ప్రత్యేక బృందాలు నిర్వహిస్తాయని తెలిపారు.
షెడ్యూల్ ఇదే...
మిజోరాంలో నవంబరు 7న, ఛత్తీస్గడ్ లో రెండు దశల్లో నవంబరు 7న, నవంబరు 17న, మధ్యప్రదేశ్ నవంబరు 7న, రాజస్థాన్ లో 23 నవంబరులో, తెలంగాణలో నవంబరు 30న పోలింగ్ జరగనుంది. అన్ని రాష్ట్రాల్లో డిసెంబరు 3వ తేదీన కౌంటింగ్ జరుగుతుందని ఆయన తెలిపారు. ఛత్తీస్ గఢ్ తప్ప మిగిలిన ఐదు రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయని రాజీవ్ కుమార్ తెలిపారు. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి రానుందని ఆయన తెలిపారు. నవంబరు పదో తేదీ వరకూ నామినేషన్ల స్వీకరిస్తారు. నవంబరు మూడో తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబరు పదమూడో తేదీన స్క్రూటినీ నిర్వహిస్తారు. పదిహేనో తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. డిసెంబరు మూడో తేదీన ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.
Next Story