Wed Mar 11 2026 12:45:10 GMT+0530 (India Standard Time)
మీ కారుకు బుల్ బార్ ఉందా? అయితే మీరు చిక్కుల్లో పడినట్లే
మీ కార్లకు అదనపు హంగులు సమకూర్చుకుంటే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నారు

మీ కార్లకు అదనపు హంగులు సమకూర్చుకుంటే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నారు. బుల్ బార్లపై కేంద్రం నిషేధం విధించింది. కారుకు బుల్ బార్ ఉంటే వెంటనే తీసేయాలి. లేదంటే జరిమానా తప్పదు. ఇప్పటికే దేశంలోని అనేక మంది వాహనదారులు తమ కారును మరింత ఆకర్షణీయంగా కనిపించేందుకు లేదా అదనపు రక్షణ కోసం కొన్ని యాక్సెసరీలను అమర్చుకుంటారు. వాటిలో ముఖ్యంగా కనిపించేది బంపర్ గార్డ్. దీనిని సాధారణంగా బుల్ బార్ , క్రాష్ గార్డ్ లని కూడా పిలుస్తారు.
కారు ముందు... వెనక
ఈ మెటల్ బార్లను కారు ముందు లేదా వెనుక బంపర్‌పై అమరుస్తారు. ప్రధానంగా ఎక్కువ సీటర్లున్న కార్లకు వీటిని ఉపయోగిస్తారు. ఆకర్షణీయంగా కనిపించడమే కాకుండా ఏదైనా వాహనం ప్రమాదానికి గురైనా వాహనం బంపర్ దెబ్బతినకుండా ఉంటుందని ఎక్కువ మంది వీటిని అమర్చుకుంటారు. వాహనాలకు రక్షణ కల్పిస్తాయని చాలా మంది భావిస్తారు. మన దేశంలో ఆర్టీఏ నిబంధనల ప్రకారం ఈ బుల్ బార్లను, బంపర్ గార్డ్లను వాడటం చట్టవిరుద్ధం. ఇలాంటివి అమర్చుకుంటే భారీగా జరిమానా విధిస్తారు.
2017లోనే కేంద్రం నిషేధం
వాహన భద్రతను దృష్టిలో ఉంచుకుని, రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ 2017లోనే ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కార్లకు బుల్ బార్లు లేదా బంపర్ గార్డ్లను నిషేధించింది. కార్లకు మాత్రమే కాదు,ఈ నిబంధన దాదాపు అన్ని రకాల వాహనాలకు వర్తిస్తుంది.ముఖ్యంగా ఎస్.యూ.వీలు,జీపులు లేదా ఇతర కార్లకు అదనంగా అమర్చే మెటల్ గార్డ్లు వాహన భద్రత ప్రమాణాలకు విరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. బంపర్ గార్డ్లు కారుకు అదనపు రక్షణ ఇస్తాయని చాలా మంది భావిస్తారు. కానీ భద్రత నిపుణుల ప్రకారం ఇవి ప్రమాద సమయంలో ఎయిర్‌బ్యాగ్ వ్యవస్థ పనితీరును దెబ్బతీసే అవకాశం ఉందని కూడా అధికారుల తెలిపారు.
ఎయిర్‌బ్యాగ్‌లపై ప్రభావం...
సాధారణంగా కారు మరొక వాహనాన్ని కానీ, మరేదైనా వస్తువును ఢీకొన్నప్పుడు వాహనంలోని సెన్సార్లు ప్రభావాన్ని గుర్తించి వెంటనే ఎయిర్‌బ్యాగ్‌లను తెరుస్తాయి.కానీ ముందు భాగంలో బుల్ బార్ లేదా బంపర్ గార్డ్ ఉండటం వల్ల ఆ ప్రభావం సెన్సార్లకు సరైన విధంగా చేరకపోవచ్చని అంటున్నారు. ఈ కారణంగా,కొన్ని సందర్భాల్లో ఎయిర్‌బ్యాగ్‌లు సమయానికి పని చేయకపోవచ్చు. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారికి ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుంది.బుల్ బార్ లేదా బంపర్ గార్డ్ కేవలం కారులో ఉన్నవారికే కాకుండా పాదచారులకు కూడా ప్రమాదకరం.ఈ మెటల్ బార్లు చాలా దృఢంగా ఉండటం వల్ల ప్రమాద సమయంలో గాయాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ఎంత జరిమానా అంటే?
ప్రమాద సమయంలో పాదచారులపై ప్రభావాన్ని కొంత వరకు తగ్గించేలా కార్ల బంపర్లను రూపొందిస్తారు. కానీ బుల్ బార్లు ఉండటం వల్ల ఆ రక్షణ తగ్గిపోతుంది. రోడ్డుపై నడిచే వ్యక్తులకు తీవ్రమైన గాయాలు అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కారుకు బుల్ బార్ లేదా బంపర్ గార్డ్ అమర్చడం మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం నేరం. సెక్షన్ 190 & 191 కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ట్రాఫిక్ పోలీసులు తనిఖీల సమయంలో వాహనంలో బుల్ బార్ కనిపిస్తే వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. అదేవిధంగా,రోడ్లపై బుల్ బార్‌తో వాహనం నడుపుతున్నట్లు గుర్తిస్తే, అక్కడికక్కడే వాటిని తొలగించే అధికారం కూడా ట్రాఫిక్ పోలీసులకు ఉంటుంది.
Next Story

