Thu Feb 13 2025 00:31:55 GMT+0000 (Coordinated Universal Time)
సోనియా గాంధీకి ప్రివిలేజ్ నోటీసు.. రాష్ట్రపతిపై వివాదస్పద వ్యాఖ్యలు
సోనియా గాంధీకి బీజేపీ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సోనియా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి

కేంద్ర బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి. రాష్ట్రప్రతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చా కార్యక్రమంలో అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లు చేసిన ప్రసంగాలు విమర్శలుకు దారి తీశాయి. అధికార పార్టీ సభ్యులు వీరి వ్యాఖ్యలకు నిరసనలు వ్యక్తం చేయడమే కాకుండా పార్లమెంటు లో ప్రివిలేజీ నోటీసులు అందచేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు తప్పు పట్టారు. ఇరవై ఒక్క మంది బీజేపీ పార్లమెంటు సభ్యులు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. గిరిజన మహిళ కావడంతోనే రాష్ట్రపతిపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తుంది.
గిరిజన మహిళపై...
సాధారణ గిరిజన మహిళ స్థాయి నుంచి దేశంలో అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతిగా ఎన్నికయిన ద్రౌపది ముర్ము పై సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆ జాతిని కించపర్చేలా ఉన్నాయని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. గిరిజన మహిళ అత్యున్నత పదవిలో ఉండటాన్ని కాంగ్రెస్ సభ్యులు సహించలేకపోతున్నారని వారు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ఉన్నత వర్గాలకు కొమ్ము కాస్తూ, దళిత, గిరిజనులను అవమానపర్చేలా మాట్లాడుతూ వారి నైతిక ధైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుందని బీజేపీ నేతలు అంటున్నారు. ఉన్నత వార్గాలకు కొమ్ము కాస్తున్న కాంగ్రెస్ ను ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. అయితే కాంగ్రెస్ కూడా దీనిపై ఎదురు దాడికి దిగింది. ఇది బీజేపీ కుట్ర అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
ఖండించిన రాష్ట్రపతి భవన్...
సోనియా గాంధీ మీడియాతో మాట్లడుతూ రాష్ట్రపతి ప్రసంగం చేస్తూ అలసి పోయారని, ఆమె మాట్లాడలేకపోయారని, పూర్ ఉమెన్ అని అన్నారు. మీడియాతో సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తప్పుపడుతుంది. రాష్ట్రపతి భవన్ సయితం సోనియా గాంధీ వ్యాఖ్యలను ఖండించింది. రాష్ట్రపతి పదవి గౌరవానికి భంగం కలిగించేలా సోనియా గాంధీ వ్యాఖ్యలున్నాయని అభిప్రాయపడింది. రాష్ట్రపతి ప్రసంగంలో ఎక్కడా అలసి పోలేదని, అణగారిన వర్గాలు, మహిళలు, రైతుల పక్షాన మాట్లాడేసమయంలో రాష్ట్రపతి ఎప్పుడూ అలసి పోరని, అటువంటి వ్యాఖ్యలు దురదృష్టకరమని రాష్ట్రపతి భవన్ తెలిపింది. అయితే దీనిపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. గిరిజనుల పట్ల కాంగ్రెస్ తన అక్కసును ఈ విధంగా వ్యక్తపర్చిందన్న ప్రధాని మోదీ, కాంగ్రెస్ రాజకుటుంబం రాష్ట్రపతిని అవమానించేలా వ్యవహరించడం సరికాదని అన్నారు. పూర్ ఉమెన్ అని రాష్ట్రపతిని అని ఆమెనే కాదు గిరిజన జాతిని కాంగ్రెస్ నేతలు అవమానించారన్నారు.
Next Story