Mon Feb 02 2026 14:09:08 GMT+0000 (Coordinated Universal Time)
అరుదైన బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. రెండు తలల మధ్య నుంచి మూడో చేయి!
ఆపరేషన్ కు ముందు తీసిన సోనోగ్రఫీ రిపోర్టులో మహిళ గర్భంలో కవలలు ఉన్నట్లు గుర్తించారు. కానీ.. ఆపరేషన్ చేశాక ఒకే శరీరానికి..

రాట్లాం : కవలలు అతుక్కొని పుట్టడం కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం. కానీ.. రెండు తలలు, ఒక శరీరం, మూడు చేతులతో ఉన్న కవలలను ఎక్కడా చూసుండరు. అలాంటి అరుదైన బిడ్డకు మధ్యప్రదేశ్ లో ఓ గర్భిణీ జన్మనిచ్చింది. రాట్లాం జిల్లాలోని జావ్రా గ్రామానికి చెందిన షహీన్ నిండు గర్భిణి. పురిటినొప్పులు రావడంతో వెంటనే ఆమెను రాట్లాంలోని ఆస్పత్రికి తరలించారు. ఆపరేషన్ చేసి డెలివరీ చేసిన వైద్యులు.. బిడ్డను చూసి ఆశ్చర్యపోయారు. బిడ్డకు రెండు తలలు, మూడు చేతలు ఉండటాన్ని చూసిన వారంతా నిర్ఘాంతపోయారు.
ఆపరేషన్ కు ముందు తీసిన సోనోగ్రఫీ రిపోర్టులో మహిళ గర్భంలో కవలలు ఉన్నట్లు గుర్తించారు. కానీ.. ఆపరేషన్ చేశాక ఒకే శరీరానికి రెండు తలలు, మూడు చేతులుండటం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. రెండు తలల మధ్య వెనుక నుంచి మూడో చేయి ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బిడ్డను వెంటనే నవజాత శిశువుల ప్రత్యేక సంరక్షణ యూనిట్ (ఎస్ఎన్సీయూ)కు తరలించారు. అక్కడ కొంత సమయం ఉంచి తర్వాత ఇండోర్‌లోని ఎంవై ఆసుపత్రిలోని ఐసీయూకు తరలించారు. బిడ్డ ఇలా జన్మించడాన్ని వైద్య పరిభాషలో 'పాలీసెఫాలీ కండిషన్' అంటారని.. ప్రస్తుతం శిశువు పరిస్థితి విషమంగా ఉందని ఎస్ఎన్సీయూ ఇన్చార్జ్ డాక్టర్ నవీద్ ఖురేషీ తెలిపారు. ఇలాంటి కేసుల్లో శిశువు గర్భంలోనే మరణిస్తుందని, లేదంటే పుట్టిన 48 గంటల్లోనైనా ప్రాణాలు కోల్పోతుందన్నారు. సర్జరీ చేసే అవకాశం ఉన్నా 60-70 శాతం మంది చిన్నారులు బతకడం లేదని డాక్టర్ నవీద్ వివరించారు.
Next Story

