Mon Jun 16 2025 19:35:24 GMT+0000 (Coordinated Universal Time)
గొట్టాలతోనే గూఢచర్యం ...వీరితో జాగ్రత్తగా ఉండాల్సిందేనా మరి
పాకిస్తాన్ గూఢచర్యం కేసులో వరసగా యూట్యూబర్లు అరెస్ట్ అవుతుండటం చర్చనీయాంశంగా మారింది

పాకిస్తాన్ గూఢచర్యం కేసులో వరసగా యూట్యూబర్లు అరెస్ట్ అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. సరదాగా వీరు వీడియోలో చేసుకుంటూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారని భావించిన వారికి వీరు చేసే అరాచకాలు తెలిసిన తర్వాత గొట్టంతోనే గూఢచర్యం మొదలు పెట్టారని అర్థమయింది. అయితే యూట్యూబర్లలో అందరూ కాకపోయినా కొందరి వ్యవహార శైలిని అనుమానించాల్సిందే. రాష్ట్రాలు దాటి.. దేశం దాటి వెళుతూ వీరు చేస్తున్న వీడియోల వెనక కేవలం వీడియోలకు వచ్చే ఆదాయం మాత్రమే కాదు.. వీరికి అదనపు ఆదాయం భారీగానే సమకూరుతుంది. వీడియోల ద్వారా ఎంత మంది వీక్షిస్తే అంత పెద్దమొత్తంలో నగదును ఆర్జిస్తుటారు. వ్యూస్.. లైక్స్, సబ్ స్క్రైబర్స్ తోనే సొమ్ము వచ్చిపడుతుంది.
అదనపు ఆదాయం కోసం...
కానీ ఈ "గొట్టం"గాళ్లకు ఈ డబ్బు సరిపోవడం లేదు. అదనంగా ఆదాయం కావాల్సి వచ్చి పుట్టి పెరిగిన దేశ రహస్యాలను విదేశాలకు విక్రయిస్తూ సొమ్ముచేసకుంటున్నారు. మొన్న జ్యోతి మల్హోత్రా అరెస్ట్ తో యూట్యూబర్ల అంటేనే ఒకరకమైన ఏహ్యభావం మొదలయింది. అదే సమయంలో అందరినీ కాకపోయినా వరసగా కేసులు నమోదవుతున్నాయి. సన్నీ యాదవ్ ను కూడా ఎన్ఐఏ అధికారుల అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇక తాజాగా పంజాబ్ పోలీసులు యూట్యూబర్ జస్పీర్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తే అనేక రకమైన ఆసక్తి కరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కీలక విషయాలుబయటకు రావడంతో పాటు గూడఛార్య నెట్ వర్క్ కు అసలు సూత్రధారి పాక్ కు చెందిన మాజీ పోలీసు అధికారి అని జస్పీర్ సింగ్ పోలీసులకు తెలిపాడు.
పాక్ నెట్ వర్క్ మామూలుగా లేదటగా...
నాసిర్ థిల్లాన్ అనే పాక్ మాజీ సబ్ ఇన్ స్పెక్టర్ ఈ గూఢచర్యం కేసులో కీలకంగా వ్యవహరించారని జస్బీర్ సింగ్ తెలిపారు. ఐఎస్ఐ అధికారికి తనను పరిచయం చేసింది కూడా థిల్లానేనని జస్బీర్ చెప్పడం విశేషం. దీంతో పాటు ఇటీవల అరెస్టయిన జ్యోతి మల్హోత్రాతో పాటు తాను కూడా లాహోర్ లో పది రోజులు ఉన్నానని వెల్లడించాడు. ఈ సందర్భంలోనే పాక్ కు చెందిన యూ ట్యూబర్ల గురించి తమకు థిల్లాన్ తెలియచేశాడని, అనేక మంది భారత్ కు చెందిన యూట్యూబర్లను గూఢచర్యంలోకి లాగడానికి పాక్ లో పెద్ద నెట్ వర్క్ పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. ఇందులో మాజీ పోలీసు అధికారులు ఎక్కువ మంది ఉన్నారని కూడా చెప్పడంతో ఇప్పుడు యూట్యూబర్లపైనే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. గొట్టంగాళ్లతో జాగ్రత్తగా ఉండాల్సిందేనన్న హెచ్చరికలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.
Next Story