Sun Nov 10 2024 09:25:11 GMT+0000 (Coordinated Universal Time)
ప్రేమికుల పెళ్లితో కరెంటు కోత కథ సుఖాంతం
కొంతకాలంగా ఆ గ్రామంలో రాత్రయితే అంధకారం అలుముకుంటోంది. పైగా.. రెండు బైక్ లు, కరెంట్ మోటార్లు కూడా..
కొందరు ప్రేమికులు.. తమ ప్రేమను గెలిపించుకోడానికి ఎంతకైనా తెగిస్తారు. ప్రేమికులను కలుసుకునేందుకు నానా పాట్లు పడుతుంటారు. అలా ఓ ప్రేమజంట ఎవరికంట పడకుండా కలుసుకునేందుకు ఓ ప్లాన్ వేసింది. అదే కరెంట్ కట్. రోజూ రాత్రయితే చాలు.. ఒకే సమయంలో ఊరంతా కరెంట్ పోతుంది. కొంతకాలంగా ఆ గ్రామంలో రాత్రయితే అంధకారం అలుముకుంటోంది. పైగా.. రెండు బైక్ లు, కరెంట్ మోటార్లు కూడా మాయమయ్యాయి. గ్రామస్తులకు అనుమానం కలిగి.. ఓ రోజు మాటువేసి మరీ ఆ కరెంట్ కట్ చేస్తున్న దొంగల్ని పట్టుకున్నారు. తీరా చూస్తే వాళ్లిద్దరూ.. ఏకాంతంలో ఆనంద డోలికల్లో మునిగితేలుతున్నారు. ఈ ఘటన బీహార్ లోని బేతియా జిల్లా నౌతన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ప్రతిరోజూ జరుగుతున్న తతంగమిది.
గ్రామానికి చెందిన యువతి తన ప్రియుడిని రహస్యంగా కలుసుకునేందుకు ప్రతిరోజూ రాత్రి ఒకే సమయంలో ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లి విద్యుత్ సరఫరాను నిలిపివేసేది. ఆ తర్వాత ఇద్దరూ ఏకాంతంగా కలుసుకునేవారు. ఓ రోజు రెండు బైక్ లు, కరెంట్ మోటార్లు, కొన్ని మేకలు అపహరణకు గురికావడంతో.. ఊళ్లోనే ఎవరో కావాలని చేస్తున్నారని గ్రామస్తులకు అనుమానం కలిగింది. మాటు వేసి వాళ్లిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఊరందరికీ కరెంట్ తీసేసి.. వాళ్లిద్దరూ చేస్తున్న పని చూసిన గ్రామస్తులకు చిర్రెత్తింది. ఇద్దరికీ దేహశుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించగా.. పోలీసులు ఇరువురి పెద్దలతో మాట్లాడి వారి పెళ్లికి ఒప్పించారు. అలా ప్రేమజంట.. కరెంటు కోత కథ సుఖాంతమైంది.
Next Story