Fri Dec 05 2025 21:49:02 GMT+0000 (Coordinated Universal Time)
Vena Reddy : ట్రెండింగ్ లో వీణారెడ్డి.. ఎవరీమె.. భారత్ కు ఎందుకు వచ్చారు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్స్ ఇండియా లో కలకలం రేపుతున్నాయి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్స్ ఇండియా లో కలకలం రేపుతున్నాయి. గత బైడెన్ ప్రభుత్వం భారత్ లో 2024 లో జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడానికి దాదాపు 180 కోట్ల రూపాయలు కేటాయించింది. ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్ లో ఓటింగ్ శాతం పెంచడానికి 21 మిలియన్ డాలర్లు ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించిన తర్వాత అనేక అనుమానాలు తలెత్తాయి. భారత్ లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలను నిర్వహిస్తారు. ఇందుకు స్వతంత్ర ప్రతిపత్తి గల కేంద్ర ఎన్నికల కమిషన్ ఉంది. మరి అమెరికాకు భారత్ లో ఓటింగ్ పెంచాల్సిన పనేముంది? ఇంత పెద్దమొత్తం వ్యయం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నవుతాయి.
బైడన్ విడుదలచేసిన సొమ్ముతో...
ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు ఆ నిధులను నిలిపేసినా.. బైడెన్ విడుదల చేసిన డబ్బులతో ఏం చేశారన్నది మాత్రం మిస్టరీగా మారింది. ఎవరికి వారు తమకు తోచినట్లు చెబుతున్నారు. బీజేపీ ఒకడుగు ముందుకు వేసి మోదీని ఓడించేందుకు బైడన్ ఈ డబ్బులను భారత్ కు పంపించారని బీజేపీ ఆరోపించింది. మోదీకి, ట్రంప్ కు ఉన్న సన్నిహిత్యం కారణంగానే మొన్నటి ఎన్నికల్లో మోదీని ఓడించడానికి పెద్దయెత్తున నిధులు ఖర్చు చేశారన్నది కమలనాధుల ఆరోపణ. అయితే బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో యూఎస్ ఎయిడ్ తరుపున ఎన్నికల్లో పనిచేసేందుకు వీణారెడ్డిని బైడన్ ప్రభుత్వం ఇండియాకు పంపింది. 2021లో భారత్ కు వచ్చిన వీణారెడ్డి తిరిగి 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత అమెరికాకు తిరిగి వెళ్లారు.
ఆరోపణలు - ప్రత్యారోపణలు...
అయితే తాజాగా బీజేపీ బీజేపీ ఎంపీ మహేశ్ జఠ్మలానీ ఈ విషయంలో వీణారెడ్డి పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో దీనిపై పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. దీంతో అసలు వీణారెడ్డి ఎవరంటూ గూగుల్ సెర్చ్ చేయడాన్ని అనేక మంది ప్రారంభించారు. వీణారెడ్డి దాదాపు మూడేళ్లు భారత్ లో ఉండి ఎవరికి అనుకూలంగా పనిచేశారన్న దానిపై విచారణ జరపాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఎవరిని గెలిపించాలన్న ఉద్దేశ్యంతో వచ్చారని ఆయన ప్రశ్నిచంారు. ఇదిలా ఉండగా ఎన్నికల కమిషన్, యూఎస్ఏఐడీ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా పనిచేశామని వారు చెబుతున్నారు. కానీ ఇందులో ఏదో కుట్రకోణం ఉందని బీజేపీ ఆరోపిస్తుంది. ప్రస్తుతం వీణారెడ్డి పేరు నెట్టింట మారుమోగిపోతుంది.
Next Story

