పుట్టినరోజు నాడే అల్ ఖైదా ఉగ్రవాదులు బంధించారు
పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో అల్ ఖైదా ఉగ్రవాదులు తెలుగు వ్యక్తిని కిడ్నాప్ చేశారు.

పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో అల్ ఖైదా ఉగ్రవాదులు తెలుగు వ్యక్తిని కిడ్నాప్ చేశారు. పల్నాడు జిల్లా, మాచర్ల మండలం, జమ్మలమడక గ్రామానికి చెందిన అమరలింగేశ్వర రావు ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్నారు. దశాబ్దానికి పైగా అమరలింగేశ్వర రావు మాలిలోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఈ ఫ్యాక్టరీపై దాడి చేసిన ఉగ్రవాదులు, ఆయనతో పాటు మరో ఇద్దరు భారతీయులను అపహరించారు. అమరలింగేశ్వర రావును ఉగ్రవాదుల చెర నుంచి సురక్షితంగా విడిపించి తీసుకురావాలని ఆయన కుటుంబం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు.
ఉగ్రవాదులు అపహరించిన వారిలో ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన పి.వెంకటరమణ కూడా ఉన్నారు. ఆర్నెల్ల కిందట ముంబయికి చెందిన బ్లూస్టార్ అనే కంపెనీ ద్వారా మాలి వెళ్లి సిమెంట్ ఫ్యాక్టరీలో పర్యవేక్షకునిగా పనిచేస్తున్నారు. వెంకటరమణ పుట్టినరోజు నాడే ఈ కిడ్నాప్ జరిగిందని అతడి కుటుంబ సభ్యులు వాపోయారు.