Fri Dec 05 2025 15:59:19 GMT+0000 (Coordinated Universal Time)
Daya Nayak : మాఫియాకు షేకింగ్ న్యూస్ ...దయా నాయక్ ఎంట్రీ
ముంబయిలో సైఫ్ ఆలీఖాన్ ఇంట్లో దాడి ఘటనతో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ పేరు మరోసారి ముంబయి మాఫియాను షేక్ చేస్తుంది.

దయా నాయక్.. ఈ పేరు వింటేనే నేరగాళ్ల గుండెల్లో దడ పుడుతుందంతే. ముంబయిలో సైఫ్ ఆలీఖాన్ ఇంటిలో దొంగతనం ఆపై దాడి ఘటనతో ఈ పేరు మరోసారి ముంబయి మాఫియాను షేక్ చేస్తుంది. అదృష్టవశాత్తూ సైఫ్ ఆలీఖాన్ ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. దీంతో మహారాష్ట్రలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దయా నాయక్ ను రంగంలోకి దించినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న నేరగాళ్లు దయా నాయక్ కన్ను తమ మీద పడకుండా ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముంబయి సినీరంగ ప్రముఖులపై వరస హెచ్చరికలతో అలెర్ట్ అయిన సర్కార్ ఈ ఆపరేషన్ ను దయానాయక్ ను అప్పగించినట్లు తెలుస్తోంది.
సైఫ్ ఆలీఖాన్ ఇంట్లో...
ఎందుకంటే దయానాయక్ సైఫ్ ఆలీఖాన్ ఇంటికి వచ్చి దొంగ ప్రవేశించిన మార్గాన్ని, అతడితో ఘర్షణ జరిగిన ప్రదేశాన్ని చూసి వెళ్లారు. దాడి జరిగిన దానిపై అన్ని కోణాల్లో ఆయన దర్యాప్తు స్పాట్ లోనే చేశారు. ఇంట్లో వారిని అడిగి అన్ని వివరాలను దయానాయక్ తెలుసుకున్నారు. పటిష్టమైన భద్రత ఉన్న సైఫ్ ఆలీఖాన్ ఇంట్లోకి నిందితుడు ఎలా చొరబడ్డారన్న దానిపై ఆయన ప్రత్యేకించి ఆరా తీశారు. సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలించారు. అక్కడి నుంచి నిందితుడు వెళ్లిన అన్ని మార్గాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని సేకరించాలని కూడా సిబ్బందిని ఆదేశించినట్లు తెలిసింది. ఇప్పుడు ముంబయి మాఫియా దయా ఎంట్రీతో షేక్ అవుతుండటమే కాకుండా ఆయన నుంచి తప్పించుకోవడానికి అనేక మార్గాలను వెతుకుతుంది.
ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా...
దయానాయక్ అంటేనే ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్. అండర్ వరల్డ్ నెట్ వర్క్ లో పనిచేస్తున్న వారిలో చాలా మందిని ఆయన మట్టుబెట్టారు. కర్ణాటకలోని ఉడిపికి చెందిన దయా నాయక్ కుటుంబం 1979లో ముంబయికి వచ్చి స్థిరపడింది. తర్వాత 1995 బ్యాచ్ ఐపీఎస్ గా ఆయన ముంబయి జుహుపోలీస్ స్టేషన్ లో తొలుత ఎస్ఐగా చేరారు. ముంబయిలో అండర్ వరల్డ్ గ్యాంగ్ పీచమణిచి వేయడంలో దయా నాయక్ పేరు మారుమోగిపోయింది. చివరకు ఛోటా రాజన్ గ్యాంగ్ లో ప్రముఖులను ఇద్దరిని ఎన్ కౌంటర్ చేయడంతో ఆయన మరింత ఫేమస్ అయ్యారు. ఎన్ కౌంటర్ లు చేయడంలో దిట్టగా పేరుపొందారు. మధ్యలో ఆయన ఉద్యోగం నుంచి సస్పెండ్ అయినా తిరిగి 2012లో మళ్లీ ముంబయిలో అదనపు కమిషనర్ గా చేరారు. సైఫ్ ఇంట్లో దయా నాయక్ కనపడటంతో నేరగాళ్లు ఎక్కడ దాక్కున్నా ఇక దబిడిదిబిడే అని అంటున్నారు. మొత్తం మీద దయా నాయక్ ఎంట్రీతో ముంబయి మాఫియాలో కూడా దడ ప్రారంభమయినట్లే.
Next Story

