Wed Jul 16 2025 23:12:20 GMT+0000 (Coordinated Universal Time)
ACB L ఏందిరా మావా.. ముప్ఫయేళ్లలో వందల కోట్లు ఎలా సంపాదించావ్
కాళేశ్వరం మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.

కాళేశ్వరం మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. నిన్న కస్టడీలోకి తీసుకున్న శ్రీధర్ ను నేడు రెండో రోజు శ్రీధర్‌ను విచారిస్తున్నారు. మొత్తం ఐదు రోజుల పాటు నూనె శ్రీధర్ ను ఏసీబీ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. అయితే తొలిరోజు కస్టడీ విచారణలోనే నూనె శ్రీధర్ నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకున్నారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే నూనె శ్రీధర్ ఆస్తులు వంద కోట్ల రూపాయలు దాటేశాయని, అయితే బ్యాంకు లాకర్లు ఓపెన్ చేస్తే ఇంకెన్ని విషయాలు బయటపడతాయోనన్న ఆసక్తి నెలకొంది. నీటిపారుదల శాఖ అధికారుల చేతివాటం నూనె శ్రీధర్ అరెస్ట్ తర్వాత మరింతగా బయటపడుతున్నాయి.
బల్ల కింద చేయిపెట్టి...
ప్రభుత్వాలు నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడం కొందరు అధికారుల పాలిటవరంగా మారిందనే చెప్పాలి. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన శ్రీధర్ నీటిపారుదల శాఖలో బల్ల కింద చేయి పెట్టి భారీగానే సంపాదించినట్లు ఏసీబీ అధికారుల విచారణలో వెల్లడయింది. 1992లో ఏఈీఈగా విధుల్లోకి చేరిన శ్రీధర్ తర్వాత ప్రమోషన్ల ద్వారా డీఈఈ, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా పదోన్నతులు పొందారు. అంతకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసేనప్పుడే వీర కుమ్ముడు కుమ్మేశాడని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం చొప్పదండిలో ఎస్సార్పీసీ లో ఈఈ గా విధుల నిర్వహిస్తున్న నూనె శ్రీధర్ పై ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న సమాచారం రావడంతో ఏసీబీ అధికారులు దాడులు చేసి వందల కోట్ల రూపాయల విలువైన స్థిర, చరాస్థులున్నట్లు గుర్తించారు.
ఎన్ని భవనాలో...?
అమీర్ పేట్ లో భవనం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ శ్రీధర్ కు అక్కడ భవనం ఉంది. అదీ కమర్షియల్ కాంప్లెక్స్. ఇక తెల్లాపూర్ లో విల్లాతో పాటు కరీంనగర్ లో మూడు ఇళ్లు, షేక్ పేట్ లో ఒక ఫ్లాట్, ఇంకా వ్యవసాయ భూములున్నాయని తెలిపారు. ఇవి కాకుండా కరీనంగర్, హైదరాబాద్, వరంగల్ లలో పందొమ్మిది ఓపెన్ ప్లాట్లు ఉన్నాయని ఏసీబీ దర్యాప్తులో వెల్లడయింది. దీంతో పాటు పదహారు ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది. ఇక కార్లు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు కూడా ఉన్నాయి. ఇక బ్యాంకు లాకర్ ఓపెన్ చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు.
కొందరికి బినామీగా...
నూనె శ్రీధర్ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల్లో కొందరికి బినామీగా ఉన్నట్లు గుర్తించారు. సోదాలలో ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఉన్నత అధికారిని కూడా విచారించేందుకు సిద్ధమవుతున్నారు. శ్రీధర్ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి లెక్కలు తీస్తున్నారు. మొత్తం వంద కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు గుర్తించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు బ్యాంకు లాకర్లు ఓపెన్ చేస్తే మరిన్ని కీలకమైన ఆధారాలు లభిస్తాయని చెబుతున్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణ జరుగుతున్న సమయంలో అదే శాఖలో పనిచేసిన ఇంజినీరింగ్ అధికారికి వందల కోట్ల రూపాయల అక్రమాస్తులుండటంతో ఇక రాజకీయ నేతలు ఎంత సంపాదించారన్న చర్చలు సాగుతున్నాయి.
Next Story