Sun Feb 01 2026 06:05:10 GMT+0000 (Coordinated Universal Time)
Union Budget : నిర్మలమ్మ బడ్జెట్ వారికి ఊరట కలిగిస్తుందా?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ నేడు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ నేడు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ ఏడాది బడ్జెట్ లో వేతన జీవులకు, సీనియర్ సిటజన్లకు ఊరట దక్కే అవకాశాలున్నాయి. వారే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. వ్యాపార, పారిశ్రామిక వర్గాలకు సంబంధించి కూడా కొంత అనుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశముందని అంటున్నారు. 2026-27 సంవత్సరానికి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఆదివారం కేంద్ర బడ్జెట్‌ను ప్రకటించడం ఇదే తొలిసారి.ఈసారి బడ్జెట్లో స్థిరమైన వృద్ధి, ఉద్యోగాల కల్పన, తయారీ రంగానికి ఊతమిచ్చే నిర్ణయాలుండాలని నిపుణులు సూచిస్తున్నారు.
అసలైన పరీక్ష...
అంతర్జాతీయ ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాల నేపథ్యంలో పారిశ్రామిక రంగం డిమాండ్లనూ పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే.. సంస్కరణలకు నడుం బిగించాలని సలహా ఇస్తున్నారు. నిజానికి దేశీయ మార్కెట్లో వినియోగదారుల కొనుగోలు శక్తి క్రమేణా క్షీణిస్తున్నది. దాన్ని బలపర్చే విషయంలో ఇప్పటికే మోదీ సర్కార్ తీవ్ర ఒత్తిళ్లనే ఎదుర్కొంటున్నదని పలువురు ఆర్థిక విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. అందుకే ఈ బడ్జెట్‌ను ఉద్యోగ కల్పన, పెట్టుబడుల పెంపునకు సదవకాశంగా భావించి చర్యలు చేపడితే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. ముఖ్యంగా భారత్‌పై విదేశీ మదుపరులలో సన్నగిల్లిన విశ్వాసాన్ని పెంపొందించడం.. ఆర్థిక మంత్రి ఎదుట ఇప్పటికిప్పుడున్న అసలు పరీక్షగా వారు పేర్కొంటుండటం గమనార్హం. భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు అదేపనిగా పెట్టుబడుల ఉపసంహరణకు దిగుతున్నారని, ఈ పరిణామం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువనూ గట్టిగానే ప్రభావితం చేస్తున్నట్టు తెలియజేస్తున్నారు.
ఐటీ స్లాబు ల విషయంలో...
ఆదాయ పన్ను కు సంబంధించి కొత్త, పాత విధానాలను అవలంబిస్తున్న కేంద్రం.. పొదుపునకు పెద్దపీట వేసే పాత విధానాన్ని పట్టించుకోవడం పూర్తిగా మానేసిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే గత కొన్నేండ్లుగా ఏటా కొత్త బడ్జెట్లోనే మార్పులు చేస్తున్నది. గత బడ్జెట్లో ఐటీ స్లాబులను సవరించినదీ తెలిసిందే. అయితే ద్రవ్యోల్బణం, జాబ్ మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో నూతన ఐటీ విధానంలో గరిష్ఠ స్లాబును సడలించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వార్షిక ఆదాయం రూ.24 లక్షలు దాటితే 30 శాతం పన్ను వర్తిస్తున్నది. దీంతో ఈ పరిమితిని పెంచాలని కోరుతున్నారు. పన్ను మినహాయింపు, స్టాండర్డ్ డిడక్షన్ల పరిమితుల్నీ పెంచాలంటున్నారు. అలాగే టీడీఎస్‌కు సంబంధించి కూడా ఊరటనివ్వాలని పన్ను చెల్లింపుదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి నిర్మలమ్మ బడ్జెట్ ఎవరికి అనుకూలంగా ఉంటుందో చూడాలి.
Next Story

