హీరోగారికి 'ఓసీడీ' ఉందంట

డైరెక్టర్ మారుతి తన పాత జోనర్ ని వదిలేసినట్టే కనబడుతుంది. ఎందుకంటే ప్రేమ కథా చిత్రాన్ని నిర్మించి ఆ సినిమాని హిట్ దశగా నడిపించాడు. అలాగే నాని హీరోగా 'భలే భలే మగాడివోయ్' వంటి డిఫరెంట్ మూవీతో ఆకట్టుకున్నాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యింది కూడా. ఆ సినిమాలో హీరో నాని కి మతిమరుపు ఉంటుంది. మతిమరుపు కాన్సెప్ట్ తో డైరెక్టర్ మారుతి 100 శాతం మార్కులు కొట్టేసాడు ఆ సినిమాకి. అలాంటి మతిమరుపు లక్షణాలున్న నాని ఈ సినిమా మొత్తం వినోదంతోనే అరిపించేసాడు.
ఇక వెంకటేష్ తో 'బాబు బంగారం' అంటూ తెరకెక్కించి చేతులు కాల్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని శర్వానంద్ హీరోగా 'మహానుభావుడు' చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. ఈ సినిమా చడీ చప్పుడు లేకుండా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు విడుదలకు సిద్దమవుతుంది.ఇప్పుడిప్పుడే ప్రమోషన్ కార్యక్రమాలకు నాంది పలికిన ఈ చిత్ర టీజర్ ఈ రోజు గురువారం ఉదయమే విడుదల చేసింది చిత్ర యూనిట్.
శర్వానంద్, ఆనంద్ రోల్ లో రిచ్ కిడ్ గానే కనిపిస్తున్నాడు. ఇక ఈ టీజర్ లో శర్వానంద్ 'నా పేరు ఆనంద్..నాకు ఓసీడీ ఉంది. అంటే అదేదో బీటెక్ డిగ్రీలాంటిది కాదు. డిజార్డర్. దీని లక్షణాలు అతి శుభ్రం...' అంటూ చెప్పే డైలాగ్ తో మొదలవుతుంది. మరి అతి శుభ్రం అంటే ఎలా ఉండబోతుందో కూడా ఈ సినిమాలో క్లియర్ కట్ గా చూపించేసారు. చేసిందే చెయ్యడం.... తోమిందే తోమడం... కడిగిందే కడగడం ఇవి అతి శుభ్ర లక్షణాలన్నమాట. కనీసం ఎదుటివాడి తుమ్ముకు భయపడి దూరంగా వెళ్లిపోవడం, అలాగే హీరోయిన్ మెహరీన్ కాళ్లతో కాళ్ళు కలాపాలన్నా స్ప్రే కొట్టి మరీ క్లిన్ చెయ్యడం, ఆఖరికి హీరోయిన్ కి ముద్దు పెట్టాలన్నా ఆమెని బ్రెష్ చేసుకున్నావా అని అడగడం చూస్తుంటే మాత్రం హీరో అతిగా శుభ్రత పాటించే వాడిగా సూపర్ కామెడీతో ఈ సినిమాలో ఆకట్టుకునేలాగే కనబడుతున్నాడు.
ఇక ఈ చిత్రంలో శర్వానంద్ కి జోడిగా 'కృష్ణగాడి వీరప్రేమ గాద' ఫెమ్ మెహరీన్ కౌర్ నటిస్తుండగా.... ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్ వారు నిర్మిస్తుండగా.. ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే ఈ చిత్రాన్ని 'జై లవ కుశ, స్పైడర్' చిత్రాలకి పోటీగా దసరా బరిలో నిలపాలనే ఆలోచనలో డైరెక్టర్ మారుతి, హీరో శర్వానంద్ లు ఉన్నారు.

