స్వీటీ భుజస్కంధాలపైనే భారమంతా

నేటి తరంలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకి క్రేజ్ తీసుకొచ్చి, ఎలాంటి స్టార్ ఇమేజ్ వున్న హీరోలు లేకుండా కూడా ఒక చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద స్టార్ హీరోల చిత్రాలకి సమానంగా వసూళ్లు సాధించగలదు అని నిరూపించిన కథానాయికలు తెలుగు లో అనుష్క, తమిళం లో నయనతార. అనుష్క తొలిసారి లేడీ ఓరియెంటెడ్ చిత్రం అరుంధతి చిత్రం చేసి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. తరువాతి కాలంలో పంచాక్షరీ చిత్రం నిరాశ పరచగా రుద్రమదేవి ఆడినప్పటికీ ఆ చిత్రంలో అల్లు అర్జున్, దగ్గుబాటి రానా వంటి ప్రేక్షకులకి తెలిసిన స్టార్ హీరోస్ ఉండటంతో క్రెడిట్ అందరూ పంచుకోవాల్సి వచ్చింది.
ఈ రిపబ్లిక్ డే కి ఊహించిన పోటీ కూడా వెనక్కి తగ్గటంతో సోలోగా బాక్స్ ఆఫీస్ కొల్లగొట్టటానికి వస్తున్న భాగమతి చిత్రం కేవలం అనుష్క ఫ్యాన్ బేస్ మీదనే నెట్టుకు రావలసిన పరిస్థితి. దర్శకుడు అశోక్ ట్రాక్ రికార్డు దారుణం గా ఉండటంతో కనీసం సినిమా పబ్లిసిటీ కూడా దర్శకుడి పేరుతో సాధ్యపడని దుస్థితి. యూ.వి.క్రియేషన్స్ వారు వారి శక్తికి మించి థియేటర్స్ ఏర్పరచే పనిలో అయితే వున్నారు కానీ భాగమతి చిత్రం ప్రేక్షకులని అలరించటానికి వున్న ఒకే ఒక్క ప్రధాన ఆకర్షణ అనుష్క కావటంతో ఇతర ప్రచార కార్యక్రమాలు కూడా ఏవి వారికి కలిసి రావటం లేదు. అయితే 2009 లోనే హీరో లేకుండా కేవలం తన అభినయంతో అరుంధతి చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద 34 కోట్ల రూపాయల షేర్ రాబట్టిన అనుష్క కి ఇప్పటి టికెట్ రేట్లకి, పెరిగిన మల్టీప్లెక్స్ ల సంఖ్యతో పోలిస్తే 50 కోట్ల రూపాయల షేర్ పెద్ద విషయమేమి కాదు కదా!

