స్టార్ హీరోస్ కూడా ప్రయోగాలు చేయొచ్చు

2014 లో అక్కినేని కుటుంబం మొత్తం కలిసి నటించిన మనం చిత్రం విజయం తరువాత అక్కినేని నాగార్జున ఒక పక్క బుల్లి తెరపై మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంతో పాటు మరో వైపు ఆయన ద్వితీయ తనయుడు అక్కినేని అఖిల్ పరిచయ చిత్రం పై పూర్తి దృష్టిని, సమయాన్ని కేటాయించటంతో గత ఏడాది అక్కినేని నాగార్జున వెండితెరపై సందడి చేయలేకపోయారు. కానీ ఈ ఏడాది ప్రధమార్ధంలోనే రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావటమే కాకుండా ప్రస్తుతం చిత్రీకరణలో రెండు చిత్రాలతో బిజీగా వున్నారు.
ఈ ఏడాది విడుదలైన అక్కినేని నాగార్జున రెండు చిత్రాలు సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి చిత్రాలు వ్యాపార పరంగా పంపిణీదారులకు కాసుల వర్షం కురిపించటమే కాకుండా స్టార్ హీరోస్ వైవిధ్యమైన పాత్రలు పోషించినా ప్రేక్షకులు ఆదరిస్తారు అని ఊపిరి చిత్రం చాటి చెప్పింది. మూస ధోరణిలో తెలుగు చిత్ర కథ కథనాలు ఉండటంపై స్పందించే సినీ ప్రముఖులు అనేక సార్లు స్టార్స్ కి వుండే ఇమేజ్ ఆంక్షల కారణంగానే కొత్త తరహా పాత్రలు, కథలు తెరకెక్కటం లేదు అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ఈ అభిప్రాయం ముమ్మాటికీ తప్పు అని, ఊపిరి చిత్రంలో వీల్ చైర్ కి పరిమితమైన నిస్సహాయ స్థితిలో వుండే రేసర్ పాత్రలో నాగార్జున కనిపించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.
ఊపిరి చిత్రం స్టార్ హీరోస్ ని కూడా కమర్షియల్ చక్రంలో నుంచి బైటకి తీసుకువచ్చి కథ చెప్పొచ్చు అని దర్శక రచయితలకు బాధపడేలా చేయగా, క్రిష్ లాంటి వారు తొలి నుంచి ఇదే పంథాలో చిత్రాలు తెరకెక్కిస్తూ సక్సెస్ అవుతున్నారు. మరి 2017 నుంచి అయినా ప్రేక్షకుల తీర్పును, స్టార్ హీరోల ఇమేజ్ ను నిందించకుండా దర్శక రచయితలు క్రిష్ శైలిలోకి ప్రయాణిస్తారేమో చూడాలి.

