సైన్స్ ఫిక్షన్‌పై కన్నేసిన మెగాఫ్యామిలీ హీరో!

మెగా ఫ్యామిలీ హీరోలంటే ఆల్మోస్ట్ అందరూ కమర్షియల్ జోనర్ ను ప్రధానంగా ఎంచుకున్న వారే. అందరూ కమర్షియల్ హీరోలుగా స్థిరపడిన వారే.. స్థిర పడడానికి పాట్లు పడుతున్న వారే. అల్లు వారి కుటుంబాన్ని కూడా సినీ ఇండస్ట్రీ మొత్తం మెగా ఫ్యామిలీ కిందనే కన్సిడర్ చేస్తుంది కాబట్టి.. వారిని కూడా లెక్కవేసినా సరే.. అందరూ కమర్షియల్ బాటలోనే ఉన్నారు. అయితే ఒక్కరు తప్ప! ఆ ఒక్కరే అల్లు శిరీష్!!
తన మొదటి చిత్రంతోనే.. తనకు కమర్షియల్ సినిమా జోనర్ మీద ప్రత్యేకమైన కోరిక ఏమీ లేదని అల్లు శిరీష్ నిరూపించుకున్నాడు. ఆ తర్వాత ఒకటి రెండూ మామూలు చిత్రాలు చేసినా.. ఏవీ పెద్ద కమర్షియల్ సక్సెస్‌లుగా నిలవలేదు. అతణ్ని ‘మెగాఫ్యామిలీ’ అనే డెఫినిషన్ కు తగిన రేంజ్ లో నిలబెట్టలేదు. అయితే తాజాగా శ్రీరస్తు శుభమస్తు చిత్రం సాధించిన విజయం తర్వాత.. శిరీష్ తెలుగు తెర మీద మరో భారీ ప్రయోగానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. రెండు చిత్రాల అనుభవం ఉన్న ఓ దర్శకుడు చెప్పిన కథ విని ఇంప్రెస్ అయిన అల్లు శిరీష్ సైన్స్ ఫిక్షన్ చిత్రం చేయబోతున్నట్లు తెలుస్తోంది. టైగర్ అనే చిత్రానికి దర్శకత్వం వహించి, ప్రస్తుతం నిఖిల్‌తో ‘ఎక్కడకు పోతావు చిన్నవాడా’ చిత్రం చేస్తున్న దర్శకుడు వి.ఐ. ఆనంద్ తో శిరీష్ ఈ చిత్రం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
సైన్స్ ఫిక్షన్ అంటే చాలా పెద్ద సంగతి. ఇవాళ్టి రోజుల్లో గ్రాఫిక్స్ అనే డిపార్ట్ మెంట్ ఎంత కీలక భూమిక పోషించినప్పటికీ.. సైన్స్ ఫిక్షన్ సినిమాలు భారీ వ్యయంతో కూడుకున్నటువంటివి. మరి అల్లు శిరీష్ కలెక్షన్ రేంజి ఇంకా పరిమితంగానే ఉంది. హీరో మీద డిపెండ్ కాకుండా.. సినిమా కథ , కంటెంట్ లోనే క్రౌడ్ పుల్లింగ్ ఎలిమెంట్ ఉంటే తప్ప.. నిర్మాతలు ఈ సైన్స్ ఫిక్షన్ సాహసానికి పూనుకుని ఉండరు లెమ్మని టాలీవుడ్ లో అనుకుంటున్నారు.

