సూపర్ స్టార్ కోసం థియేటర్లు అప్డేట్ కావాలట

దర్శకుడు శంకర్ తొలి నుంచి భారీ వ్యయంతోనే చిత్రాలు తెరకెక్కిస్తూ వస్తున్నారు. ఆయన స్వతహాగా నిర్మాత అయినప్పటికీ ఆయనలో నిర్మాతకి దర్శకుడికి చాలా వ్యత్యాసం కనపడుతుంది. శంకర్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రాలు అన్నీ పరిమిత వ్యయంతో రూపొందించినవే కాగా ఆయన దర్శకత్వం వహించే చిత్రాలు మాత్రం అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో, భారీ స్టార్ కాస్ట్ తో తయారు అయ్యేవే. ఇక ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తున్న రోబో 2 .0 చిత్రం కూడా ఇందుకు మినహాయింపు కాదు. పూర్తిగా 3D లో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారతీయ చలన చిత్రాలతోనే ప్రత్యేకం కానుంది. ఇప్పటి వరకు మన దేశంలో నిర్మితమైన 3D చిత్రాలు అన్నీ ముందుగా 2D లో తయారై 3D లోకి మార్చబడిన చిత్రాలే. రోబో 2 .0 మాత్రం నేరుగా 3D లోనే తెరకెక్కుతున్న తొలి భారతీయ చిత్రం అని తెలిపారు నిర్మాత రాజు మహాలింగం.
నిర్మాత రాజు మహాలింగం 2 .0 చిత్రం ఎంతో అధునాతక సాంకేతికతో తెరకెక్కుతోందని ఈ చిత్ర అనుభవాలను పంచుకుంటూ, "మా అబ్బాయికి పదేళ్ల వయసు. చిత్రీకరణ జరిపిన కొన్ని రషెస్ వాడికి చూపిస్తే రజని కాంత్ తనకు దగ్గరగా వస్తున్నాడు అంటూ రజని కాంత్ ని పట్టుకొబోయాడు. వచ్చే ఏడాది దీపావళి పండుగకి థియేటర్లలో విడుదల అయిన తరువాత ప్రేక్షకుడికి కూడా ఇదే అనుభూతి కలగటం ఖాయం అని మాకు రషెస్ చూసినప్పుడే అర్ధం అయిపోయింది. అయితే కేవలం మల్టీప్లెక్స్ లలో 3D లో చిత్రాన్ని విడుదల చేసి ఇతర కేంద్రాలలో 2D లో విడుదల చేయటం కాకుండా అన్నీ థియేటర్ల యాజమాన్యాలతో 3D ప్రదర్శనకు వీలుగా అప్డేట్ అయ్యే దిశగా చర్చలు సంప్రదింపులు జరుపుతున్నాం. అతి త్వరలో థియేటర్ల సంఖ్య, లిస్ట్ మాకు అందుబాటులోకి వస్తుంది. దానికి తగట్టు మా కష్టాన్ని ప్రేక్షకుడు ప్రతి ఫ్రేమ్ లోనూ ఎంజాయ్ చేసే విధంగా 3D విడుదల ప్లాన్ చేస్తాం." అని వివరించారు రాజు మహాలింగం.

