సినిమా సెట్స్ మీద లేదు.. కానీ..?

గురు సినిమా విడుదలై దాదాపు చాలా కాలం అయ్యింది. గురు సినిమా తర్వాత వెంకటేష్ సినిమా ఇప్పటివరకు సెట్స్ మీదకెళ్ళలేదు. ఇప్పుడు తాజాగా వెంకటేష్ దర్శకుడు తేజతో ఒక సినిమా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక మల్టీస్టారర్ సినిమాకి కమిట్ అయ్యాడు. ఇక వెంకటేష్ - తేజ ల సినిమా ముహూర్తం కూడా డిసెంబర్ 13 న అనే ప్రచారం జరిగింది. కానీ అది కేవలం గాలివార్తే అంటున్నారిప్పుడు. వెంకటేష్ పుట్టినరోజు డిసెంబర్ 13 న కాబట్టి అప్పుడు ఈసినిమా పూజతో మొదలవుతుందని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఇప్పుడు వెంకటేష్ - తేజ కలయికలో తెరక్కెక్కబోయే సినిమాకి వెంకటేష్ పక్కన హీరోయిన్ దొరకలేదట. ముందుగా కాజల్ అగర్వాల్ అన్నప్పటికీ ఇప్పుడు కాదంటున్నారు.
మరోపక్క అనిల్ రావిపూడి సినిమా కూడా ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆ సినిమా ప్రి ప్రొడక్షన్ వర్క్ తోపాటు... స్క్రిప్ట్ వర్క్ పూర్తి కావాల్సి ఉంది. అలాగే వెంకీ కి తోడుగా మరో హీరోని పట్టుకోవాల్సి ఉంది. మరి వెంకీకి సంబందించిన ఏ ఒక్క సినిమా పట్టాలెక్కనప్పుడు ఇప్పుడు పైన కనబడుతున్న ఈ ఫొటోస్ ఏ సినిమాకి సంబందించినవో అనే అనుమానం కలుగుతుంది. ఆ ఫొటోస్ లో కొత్త లుక్ లో వెంకటేష్‌కి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆ ఫొటోస్ ని చూసిన చాలామంది.. వెంకీ కొత్త ప్రాజెక్ట్ ఏంటి? దానికి డైరెక్టర్ ఎవరు? అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు.
అయితే పైన కనబడుతున్న వెంకటేష్ ఫొటోస్ ఏదో సినిమాకి సంబందించిన వర్కింగ్ స్టిల్స్ అయితే కావు. వెంకటేష్ సినిమాలతోపాటే పలురకాల వస్తువులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తాడు. అందులో భాగంగానే ఒక వస్తువుకు సంబందించిన యాడ్ షూట్ లో వెంకీ పాల్గొంటున్నప్పటి ఫొటోగ్రాఫ్స్ అవి. అంతేగాని ఏదో ప్రాజెక్ట్ కి సంబందించినవి అయితే కాదు.

