సన్నీ కూడా మొదలెట్టేసింది

ఈ మధ్య కాలంలో హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలు కాస్త తగ్గాయనే చెప్పాలి.తమిళ భాష నుండి డబ్ అయిన చిత్రాలు తప్పితే తెలుగు చిత్రాల్లో లేడీ ఓరియెంటెడ్ వంటి చిత్రాలు తగ్గాయి. అనుష్క చేసిన ‘రుద్రమదేవి’ తరువాత అంతగా ప్రభావం చూపే చిత్రాలు రాలేదు. ఇప్పుడు తాజాగా ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రం దక్షణాది భాషల్లో తెరకెక్కబోతుంది.. సుమారు 150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కబోతుంది.
విసి వడివుడయాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. స్టివ్స్ కార్నర్ పతాకం పై ఫోన్స్ స్టీఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఎంపికైంది. దక్షణాది రాష్ట్రాల్లో ఉండే సంస్కృతి – సంప్రదాయాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్ర కథను విన్న సన్నీ లియోన్ ఆ కథ నచ్చి ఈ చిత్రాన్ని చేయడానికి అంగీకరించినట్లు తెలిసింది. ఈ చిత్రం కోసం సన్నీ లియోన్ ఏకంగా 150రోజుల కాల్షీట్లు ఇచ్చినట్లు సమాచారం.
చరిత్రకు సంబంధించిన చిత్రం కాబట్టి ఈ చిత్రంలో యుద్ధ సన్నివేశాలు ఉంటాయి కాబట్టి సన్నీ లియోన్ ఇప్పటికే గుర్రపు స్వారీ, కత్తిసాము వంటి వాటిల్లో శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఉండే గ్రాఫిక్స్ వర్క్ ని అంతర్జాతీయ సంస్థలకు అప్పగించారట. ఫిబ్రవరి నుండి ఈ చిత్రం చిత్రీకరణ మొదలవుతుందంటున్నారు.

