శత్రువు రచనలో నటించిన అమ్మ

తమిళ నాట ఒక ప్రముఖ రాజకీయ నేత ప్రస్థానం ముగిసింది. ఒక ప్రాంతీయ పార్టీ ని జాతీయ స్థాయి పార్టీలకు పోటీగా రాష్టంలో నిలబెట్టటం ఏ పార్టీ అధ్యక్షకులకైనా సాధారణమైన విషయం కాదు. అందులోనూ ఆడ వారికి పైగా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేని కుటుంబం నుంచి వచ్చిన స్త్రీ కి అసలు సాధ్యపడని విషయం. కానీ ప్రతి పక్షాల విమర్శలకు కాక సొంత పార్టీ లోని అసమ్మతి నేతలను కూడా ఏ మాత్రం బెదురు లేకుండా ఎదుర్కొన్న నేత జయలలిత. ఆవిడ రాజకీయ జీవితంలో ఆవిడకి వున్నా ఏకైక చిరకాల ప్రత్యర్థి కరుణా నిధి. అయితే వీరిరువురు చిత్ర పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారే కావటం విశేషం. పైగా ఇద్దరు కలిసి ఒకే చిత్రానికి పని చేశారు కూడా.
జయలలిత నటి గా తమిళ చిత్ర పరిశ్రమలో ఆవిర్భవించే నాటికి కరుణా నిధి చిత్ర పరిశ్రమ నుంచి విరామం తీసుకుని రాజకీయ రంగ ప్రవేశం చేసి పూర్తి స్థాయి రాజకీయాల్లో పాల్గొనే వారు. జయలలిత 1965 లో వెన్నిరా ఆడాయి చిత్రంతో వెండి తెరకు పరిచయం కాగా, 1966 లో ఎస్ రాజేంద్రన్ అనే దర్శకుడు తీసిన మణి మకుటం చిత్రానికి ఆయన అభ్యర్ధన మేరకు కరుణా నిధి సంభాషణలు రచించారు. అదే చిత్రానికి జయలలిత ఇద్దరి కథానాయికల్లో ఒక కథానాయికగా నటించారు. ఆ దర్శకుడితో రచయిత కరుణా నిధికి వున్నా పూర్వ అనుబంధంతో ఆ చిత్రానికి సంభాషణలు రచించారు కానీ తరువాత మళ్లీ చిత్ర పరిశ్రమకు పని చేయలేదు. ఆ చిత్రం జరుగుతున్న నాటికీ జయలలిత వయసు 18 మాత్రమే. భవిష్యత్లో ఆ రచయిత, కథానాయిక దీర్ఘ కాలిక శత్రువులుగా మారిపోతారని ఎవ్వరు ఊహించలేదు.

