వెంకీ కోసం హీరో కావాలంట

పటాస్, సుప్రీమ్,రాజా ది గ్రేట్ చిత్రాలతో వరుస విజయాలు అందుకొని ఊపుమీదున్న దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. కాగా.. ఈ దర్శకుడు తన తరువాతి చిత్రం ఒక మల్టీస్టారర్ అని ఇదివరకే చెప్పేసాడు.. ఆ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు నిర్మించనున్నాడు. ఆ చిత్రానికి టైటిల్ గా ఎఫ్2 – ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అని ఖరారైందని ప్రకటించాడు అనిల్ రావిపూడి. ఇక ఈ చిత్రంలో ఒక సీనియర్ హీరో అయినా వెంకటేష్ ని ఎంపిక చేసినట్లుగా... వెంకీ తో నటించే మరో హీరోని ఎంపిక చెయ్యాల్సిఉన్నట్లుగా చెబుతున్నారు.
ఇక వెంకీతో నటించే యువ హీరోల వేట కొనసాగుతున్నట్లుగా కూడా ప్రచారం మొదలైంది. ఇప్పటికే వెంకటేష్... పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ లతో మల్టీస్టారర్ మూవీస్ లో నటించాడు. అయితే ఇప్పుడు తాజాగా నాని, శర్వానంద్, సాయిధరమ్.. ఇలా కొంత మంది హీరోల పేర్లు ఈ మల్టీస్టారర్ చిత్రం కోసం పరిగణనలోకి వచ్చాయి. త్వరలోనే ఎవరో ఒక యంగ్ హీరోను ఫైనల్ చేసి ప్రాజెక్టును పట్టాలెక్కించాలని అనిల్ రావిపూడి భావిస్తున్నాడట.
అయితే అనిల్ ఇప్పటివరకు దర్శకత్వం వహించిన మూడు చిత్రాలు కమర్షియల్ కథలే అయినా తనదైన శైలిలో కామెడీని జోడించి సినిమాను వినోదాత్మకంగా తెరకెక్కించి హిట్ కొట్టాడు. పైగా ఈ సారి ఆ వినోదం రెండింతలు ఉంటుందని అనిల్ చెప్పడంతో ఈ చిత్రం పై అంచనాలు మొదలయ్యాయి. ఇక ఈ చిత్రంలో నటించే నటీనటులు వివరాలు తెలియాల్సి ఉంది.

