విడాకుల అనంతరం వరుస అవకాశాలు

మలయాళ నాచురల్ బ్యూటీ అమల పాల్ తెలుగు తమిళ పరిశ్రమలలో అనతి కాలంలోనే గుర్తింపు సంపాదించుకుంది. అతి చిన్న వయసులో, అందులోనూ కెరీర్ పీక్ పీరియడ్ లో ఉండగానే కోలీవుడ్ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ తో ప్రేమాయణం నడిపి అతడిని వివాహం చేసుకుని కొంత కాలం సినిమాలకు దూరంగా వుంది. అమల పాల్ వైవాహిక జీవితం రెండు సంవత్సరాలకే బెడిసి కొట్టటంతో తన భర్త విజయ్ తో విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించి తన నట జీవితాన్ని తిరిగి ప్రారంభించింది. మధ్యలో సుదీర్ఘ విరామం వచ్చినప్పటికీ అమల పాల్ కి ప్రస్తుతం చేతి నిండా అవకాశాలు వున్నాయి.
తమిళ పరిశ్రమలో ప్రస్తుతం వాడా చెన్నై, తిఱుత్తు పాయాలే 2 , వెలయిల్లా పట్టతారి 2 చిత్రాలతో పాటు మలయాళం లో ఆచయన్స్ అనే చిత్రం ఒప్పుకుంది. ఈ చిత్రాలు అన్నీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్నాయి. ఈ చిత్రాలు అన్నీ 2017 లో దాదాపు ఒకే సమయానికి విడుదల అయ్యే అవకాశాలు వున్నాయి. ఈ చిత్రాలతో పాటు మలయాళంలో తెరకెక్కబోయే మరో చిత్రానికి అమల పాల్ తో సంప్రదింపులు జరుపుతున్నారు సదరు దర్శక నిర్మాతలు. మరో పక్క తమిళ చిత్రం ఓరు ఓడక్కన్ సెల్ఫీ రీమేక్ గా తెలుగులో అల్లరి నరేష్ నటించబోయే చిత్రానికి కూడా అమల పాల్ నే కథానాయికగా అనుకుంటున్నారు. అల్లరి నరేష్ లేదా మళయాళ చిత్రం వీటిల్లో ఏ చిత్రానికి అమల పాల్ కాల్ షీట్స్ ఇస్తుందో త్వరలోనే నిర్ధారణ కానుంది.

