వర్మకు వాళ్లు పగ్గాలు వదిలేసినట్టేనా?

రాంగోపాల్ వర్మ సహజంగానే వివాదాస్పద సబ్జెక్టులు తీసుకుని.. ఆ వివాదాన్నే సదరు సినిమా మార్కెట్ పునాదిగా వాడుకునే వ్యక్తి. అదే తరహాలోనే పరిటాల రవి హత్యోదంతం తర్వాత, రాష్ట్రంలో అంతటి సంచలనాంశం అయిన వంగవీటి రంగా హత్యోదంతాన్ని కూడా తీసుకున్నారు. దాన్ని తెరకెక్కించారు. వివాదాలు కాపాడతాయనే విశ్వాసంతోనే దాన్ని ఆడియో విడుదల వరకు లాక్కు వచ్చారు. తీరా ఇప్పుడు వివాదాలు బ్రేకులు వేయకుండా.. సినిమా పాత్రలకు సంబంధించిన వ్యక్తులను కలిసి బుజ్జగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లుగా కనిపిస్తోంది.
వంగవీటి సినిమా విషయంలో నిర్మాతలు, దర్శకుడు వర్మ ఇప్పటికే కొంత మేర రాజీపడడం తెలిసిందే. ఈ సినిమాలోని వివాదాస్పద కమ్మ- కాపు పాటను ఇప్పటికే తొలగించారు. అలాగే వివాదాస్పద ట్రైలర్ లను కూడా ఆపు చేస్తున్నట్లు నిర్మాత న్యాయస్థానానికి హామీ ఇచ్చారు.
శనివారం ఆడియో విడుదల సందర్భంగా రాంగోపాల్ వర్మ విజయవాడకు వెళ్లి... అక్కడ ఈ సినిమాలోని వివాదాస్పద పాత్రలకు సంబంధించిన వ్యక్తుల కుటుంబాలతో భేటీ కావడం జరిగింది. వంగవీటి రాధాతోనూ ఆయన సమావేశం అయ్యారు. అలాగే దేవినేని నెహ్రూతో కూడా సమావేశమయ్యరు. నెహ్రూతో కలిసి ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. అయితే నెహ్రూ లాంటి వాళ్లు.. ఈ చిత్రం, అందులోని కథాగమనం ఎలా ఉన్నప్పటికీ.. తమ పాత్రలను ఎలా చిత్రీకరించినప్పటికీ పట్టించుకోబోయేది లేదని దేవినేని నెహ్రూ హామీ ఇచ్చేశారు. చూడబోతే.. వర్మకు అక్కడినుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లుగానే ఉంది. తనకు ట్రైలర్ మాత్రమే చూపించారని, సినిమా చూచడలేదని చెప్పారు. సినిమాలో పాత్రలను చూసి ప్రజలు కొట్టుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు అని నెహ్రూ వ్యాఖ్యానించడం విశేషం. అయితే వంగవీటి కుటుంబంతో మాత్రం వర్మ భేటీలు అంత సుహృద్భావ వాతావరణంలో జరిగినట్లు లేదు. ఎందుకంటే.. రత్నకుమారి, రాధా లతో భేటీలపై వివాదాలు ఉన్నాయని వాటి గురించి తర్వాత మాట్లాడతానని రాంగోపాల్ వర్మ ప్రకటించారు. అయితే సినిమాపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం అయినా పట్టించుకోనని మాత్రం తేల్చి చెప్పారు.

