వర్మ కంపెనీ నుంచి వచ్చి దేశవాళీ వినోదం

శివ సినిమా నుంచి కిల్లింగ్ వీరప్పన్ వరకు, ఇంకా నిక్కచ్చిగా చెప్పాలంటే విడుదల కాబోతున్న వంగవీటి తోసహా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కథలు, సృష్టించిన పాత్రలు అన్నీ నిజ జీవితానికి దగ్గరగా మనకి రోజువారీ జీవితంలో ఎదురు వచ్చే పాత్రలు లాగా ఎంతో సహజత్వంతో నిండి ఉంటాయి. కాగా శివ చిత్రం నుంచి నేటివరకు వర్మ బాయ్స్ అని గర్వంగా చెప్పుకుంటూ దర్శకులు అయిపోయిన వారు ఎందరో వున్నారు. అయితే వర్మ డైరెక్టర్స్ ప్రొడక్షన్ ఇంకా ఆగలేదు. ఆయన నిరంతరం సినిమాలు చేస్తూ ఉండటం వలన ఆయన దర్శకత్వ బృందం ఎప్పటికప్పుడు కొత్త వారితో సవరించబడుతుంది.
శుక్రవారం విడుదల ఐన జయమ్ము నిశ్చయమ్ము సినిమా తో దర్శకుడిగా పరిచయం ఐన కనుమూరి శివ రాజ్ కూడా రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసినవాడే. ఆయన తెరకెక్కించిన తొలి చిత్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, అందులో పని చేసే ప్రభుత్వ ఉద్యోగస్తుల మనస్తత్వాలు, వారు చుట్టూ తిరిగే కథ చాలా సహజంగా ఉంటుంది. ఆర్.జీ.వి సినిమాల తరహాలోనే ఆయన శిష్యుడు కూడా కథ మరియు పాత్రలు తీర్చి దిద్దాడు. ఈ చిత్రానికి దేశవాళీ వినోదం అని ఆయన పెట్టిన టాగ్ లైన్ కి సినిమాకి వస్తున్న స్పందనకి సరిగ్గా సరిపోయినట్టుంది. తొలి చిత్రం అందులోనూ శ్రీనివాస్ రెడ్డి లాంటి హాస్య నటుడితో ఇంతటి క్రేజ్ తీసుకువచ్చాడు అంటే శివ రాజ్ తదుపరి చిత్రాలు ఎలా హేండిల్ చేస్తాడో అని ఆసక్తి పెరగటం ఖాయంగా కనిపిస్తుంది.

