యాత్ర గా వై.ఎస్.ఆర్ జీవిత కథ

ప్రస్తుతం బియోపిక్ సినిమాల ట్రెండ్ బాగా జోరుగా సాగుతుండటంతో చిన్న పెద్ద అని తేడా లేకుండా నిర్మాతలందరూ ప్రేక్షకులకి బాగా చిరస్మరణీయులైన వ్యక్తుల జీవిత కథలని సినిమాలుగా రూపొందించే పనిలో పడుతున్నారు. అలా ఆనందో బ్రహ్మ సక్సెస్ అనంతరం ఆ చిత్ర దర్శకుడు మహి రాఘవ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారి బియోపిక్ కి స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు. ఈ స్క్రిప్ట్ రచించే క్రమంలో తన రీసెర్చ్ లో భాగంగా రాజశేఖర రెడ్డి గారితో అతి సన్నిహిత సంబంధాలు వున్న ఎందరో పారిశ్రామికవేతలని, రాజకీయ ప్రముఖుల్ని కలిసి కీలకమైన వివరాలు సేకరించారట.
కాగా ఇంతవరకు రాజశేఖర రెడ్డి గారి బియోపిక్ కి స్క్రిప్ట్ సిద్ధం చేసే క్రమంలో ఆయన కుమారుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తో దర్శకుడు మహి రాఘవ సంప్రదింపులు జరపకపోవడం గమనార్హం. అయితే ఇప్పుడు జగన్ ని కలిసి స్క్రిప్ట్ వినిపించి రెడ్డి గారి కుటుంబ సభ్యులకి ఎలాంటి అభ్యంతరాలు లేకపోతేనే సినిమా ని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచన లో వున్నారు దర్శక నిర్మాతలు. ఇందుకోసం వారు జగన్ ఏదైనా స్క్రిప్టులో మార్పులు సూచిస్తే అందుకు అనుగుణంగా స్క్రిప్ట్ సర్దుబాటు చేయటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరో వైపు రాజశేఖర రెడ్డి గారి జీవిత కథకి 'యాత్ర' అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని భావించిన నిర్మాతలు విజయ్ చిల్ల, శివ ఇప్పటికే ఆ టైటిల్ ని రిజిస్టర్ చేపించారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన కూడా చేయనున్నారు.

