మొత్తం జోగేంద్ర చుట్టూనే తిరుగుతుంది!!

బాహుబలి లో విలన్ గా అదరగొట్టిన రానా ఇప్పుడు హీరోగా 'నేనే రాజు - నేనే మంత్రి' సినిమాని తేజ డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ చిత్రంలో రానా, జోగేంద్రగా అదరగొడుతున్నాడు. 'నేనే రాజు - నేనే మంత్రి' థియేట్రికల్ ట్రైలర్ తోనే ఈ సినిమాపై అంచనాలు పెంచేసి అందరిలో ఆసక్తిని కలిగించింది. ఒక మాములు కుర్రాడు తన చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మారుతూ... దుష్ట శక్తులనుండి తప్పించుకుంటూ రాజకీయనాయకుడిగా ఎలా ఎదిగాడన్నదే ఈ చిత్ర కథ అంటున్నారు.
ఇక ఈ చిత్రం మొత్తం జోగేంద్ర అనే పాత్ర చుట్టూనే తిరుగుతుండే ఒక పెద్ద కథ అని.... దర్శకుడు తేజ కథ చెప్పడానికే 2 గంటల 40 నిమిషాల టైం తీసుకున్నాడని చెబుతున్నాడు రానా. అయితే ఈ కథ మొదటిసారిగా తనకి, తన తండ్రి సురేష్ బాబు కి ఇద్దరికీ బాగా నచ్చిందని చెబుతున్న రానా ఈ సినిమాలో తన పాత్ర చాలా బావుంటుందని చెబుతున్నాడు. అలాగే మా నాన్నకి నాకు నచ్చిన ఏకైక కథ ఇదేనంటూ చెప్పుకొస్తున్నాడు రానా. ఇక నేనే రాజు నేనే మంత్రి లో కాజల్, కేథరిన్ లతో రొమాన్స్ చేస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం డ్రగ్ కేసులో నోటీసులు అందుకున్న నవదీప్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రం ఆగష్టు 12 న విడుదలకు సిద్ధమవుతోంది.

