మాజీ సీఎం పార్టనర్‌గా ప్రొడక్షన్లోకి జగపతి బాబు

రెండు దశాబ్దాలు కథానాయకుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించి ఎందరో మహిళా అభిమానులను సంపాదించుకున్న జగపతి బాబు ఇటీవలి కాలంలో ప్రతి నాయకుడి పాత్రల్లో నటిస్తూ రెట్టింపు అభిమాన జనాన్ని సంపాదించుకోవటమే కాక ప్రతినాయకుడి పాత్రల క్రేజ్ తో ఇతర భాషల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. ఇప్పుడు తిరిగి ప్రతినాయకుడి పాత్ర నుంచి కథానాయకుడిగా మారనున్నారు. అయితే రొమాంటిక్ పాటలు, డ్యూయెట్లతో నిండిన కథానాయకుడి పాత్ర కాక వయసుకి తగ్గ విధంగా ఆరు పదుల వయసు వున్న అధ్యాపకుడి పాత్ర పోషించనున్నారు.
వృద్ధుడైన అధ్యాపకుడి పాత్రలో జగపతి బాబు యవ్వన వయసులో వున్న అంధురాలు ఐన హీరోయిన్ కి పాఠాలు నేర్పే విధంగా కథ కథనాలు ఉండబోతున్నాయి అని సమాచారం. అయితే ఈ రెండు పాత్రలను పోల్చుకుని బాలీవుడ్లో సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కించిన ‘బ్లాక్’ కి ఈ చిత్రం రీమేక్ అనే ఊహాగానాలు ఎక్కువ అవుతున్నాయి. అయితే ఈ ఊహాగానాలకు ఆధారాలు లేవు. ఒక వేళ ఈ కథ బ్లాక్ చిత్రం నుంచే స్ఫూర్తి చెందినదా లేక యాదృచ్చికంగా పాత్రలు కలిశాయో నిర్మాతలు ఇప్పటి వరకు వెల్లడించలేదు.
త్వరలో చిత్రీకరణకు వెళ్ళబోతున్న ఈ చిత్రానికి కర్ణాటక మాజీ ముఖ్య మంత్రి కుమారస్వామి తో కలిసి జగపతి బాబు నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరిస్తారుట. కుమార స్వామి కూడా నిర్మాణ భాగస్వామి కావటంతో ఈ చిత్రం బైలింగువల్ గా తెరకెక్కి తెలుగు, కన్నడ భాషల్లో విడుదల అయ్యే అవకాశాలు వున్నాయి.

