మహానుభావుడు మూవీ రివ్యూ

ప్రొడక్షన్ కంపెనీ: యువీ క్రియేషన్స్
నటీనటులు: శర్వానంద్, మెహ్రీన్ కౌర్, నాజర్, వెన్నెల కిషోర్, రఘు బాబు
సంగీత దర్శకుడు: ఎస్ ఎస్ థమన్
నిర్మాత: యువీ క్రియేషన్స్
స్క్రీన్ ప్లే, దర్సకత్వం: మారుతి
కుటుంభం కథా చిత్రాలకు, కామెడీతో కూడిన చిత్రాలకు తెలుగు సినీపరిశ్రమలో ఎప్పుడూ మంచి మార్కెట్ ఉండడమే కాదు మంచి విజయాలను సాధించిన సందర్భాలు ఉన్నాయి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటెర్ టైనర్ లు తెరకెక్కిన చాలా సినిమాలు మంచి ఫలితాలతో దూసుకుపోతున్నాయి కూడా. అసలు పెద్ద పెద్ద హీరోల సినిమాల్లోనే ఎక్కువగా కామెడీకి చోటిస్తున్నారు అంటేనే... హాస్యానికి ప్రేక్షకులు ఎంతగా కనెక్ట్ అవుతున్నారో అర్ధమవుతుంది. ఇప్పుడు అలాంటి కామెడీ టైమింగ్ ని నమ్ముకుని శర్వానంద్, మారుతి దర్శకత్వంలో మహానుభావుడు అంటూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి వచ్చేశాడు. నిజంగా శర్వానంద్ మహానుభావుడే..... ఎందుకంటే రెండు పెద్ద సినిమాల హవా దసరా సెలవలకి ఉంటుంది అని తెలిసి కూడా తన చిత్రాన్ని ఈ దసరాకే దింపాడు. అసలు శర్వానంద్ కి ఎప్పుడు కాన్ఫిడెన్స్ లెవల్స్ ఎక్కువే. ఎందుకంటే తాను రావాలని ఫిక్స్ అయితే వచ్చేస్తాడు...... అంతేకాని బాక్సాఫీసు దగ్గర బడా సినిమాలు ఉన్నాయా.... లేదంటే స్టార్ హీరోల మధ్యల నలిగిపోతానా అని అస్సలు ఆలోచించడు. ఏ కాన్ఫిడెంట్ తో తన సినిమా మీద నమ్మకం పెట్టుకుంటాడో.... నిజంగా అదే నమ్మకం కంటిన్యూ అవుతుంది. ఏ స్టార్స్ తో పోటీ పడినా పండగ కి మాత్రం హిట్ హీరో అనిపించుకుంటున్నాడు ఇప్పటివరకు. దర్శకుడు మారుతి దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన భలే భలే మగాడివోయ్ వంటి కామెడీ చిత్రం ఎంత సక్సెస్ సాధించిందో.... అదేవిధంగా ఈ మహానుభావుడు ఫుల్ కామెడీతో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు వచ్చేసాయి. మారుతీ... ఒక వ్యక్తి కి ఓసిడి ఉంటే... అది అతని మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది.... అతని వల్ల ఇతరులు ఎలాంటి కష్టాలు పడతారు అనే స్టోరీ లైన్ మీదే సినిమా మొత్తాన్ని నడిపించాడు. ఒక జాబ్ హోల్డర్ గా శర్వానంద్ అతి శుభ్రతతో ఎదుటివారికి చిరాకు తెప్పిస్తూ.... ఆ అతిశుభ్రతా లక్షణంతోనే ఒక అమ్మాయిని ప్రేమలో పడెయ్యడం... ప్రేమలో పడ్డాక అనుకోని కారణాలతో అతిశుభ్రతని పక్కన పెట్టె వ్యక్తి పాత్రలో శర్వానంద్ ఇరగదీశాడనే విషయం మహానుభావుడు సినిమా ట్రైలర్ లో అర్ధమయ్యింది. శర్వానంద్ - మెహరీన్ ల జోడి మీద కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. మరి మారుతీ టైమింగ్ కామెడీ... శర్వానంద్ పెరఫార్మెన్సు తో రెండు పెద్ద చిత్రాల పోటీని తట్టుకుని ఈ విజయదశమికి వీరు మహానుభావుడుతో ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకున్నారో సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
ఓసిడి డిజాస్టర్ తో బాధపడే ఆనంద్ తన అతి శుభ్రతతో... అందరికి చిరాకు తెప్పిస్తుంటాడు. ఆ అతి శుభ్రతతోనే తన లైఫ్ స్టయిల్ ని మెయింటింగ్ చేస్తూ తన ఉద్యోగం తాను చేసుకునే అతని వల్ల బాస్ దగ్గర నుండి ఇంటిపక్కల జనాలు.. అలాగే ఆనంద్ దగ్గర ఉండే జనాలు విసుగెత్తిపోతుంటారు. తాను మాత్రమే శుభ్రంగా ఉండకుండా పక్కన వాళ్ళు కూడా అంతే శుభ్రంగా ఉండాలనుకుంటారు. ఆఫీస్ లో బాస్ తుమ్మినా... తోటి కొలీగ్ వాష్ రూమ్ కి వెళ్లి చేతులు కడుక్కోకపోయినా... అలాగే తాను ఏం చెయ్యాలనుకున్నా దాన్ని ముందు అతిగా శుభ్రం చేసిన తర్వాతే చెయ్యడం వంటి లక్షణాలతో ఉన్న ఆనంద్ కంపెనీలో పనిచేసే మేఘన( మెహ్రీన్ కౌర్) ప్రేమిస్తుంది. ఆనంద్ కూడా మేఘన ప్రేమలోనే ఉంటాడు. ఆనంద్ అతి శుభ్రతని చూసే మేఘన అతన్ని ప్రేమిస్తుంది. అలాగే ఆ ప్రేమను తన తండ్రి నాజర్ తో చెప్పి ఒప్పిస్తుంది. మేఘన తండ్రి ముందు కాదన్న తర్వాత వాళ్ల ప్రేమని ఒప్పుకుని పెళ్ళికి ఒప్పేసుకుంటాడు. అలా పెళ్ళికి ఒప్పుకున్నా.... అనుకోని కారణాలతో మేఘన.. ఆనంద్ ని రిజెక్ట్ చేసి పెళ్లి ఆపేస్తుంది. అలా ఆగిపోయిన తన పెళ్లి కోసం మళ్లీ మేఘన వాళ్ల ఊరెళ్ళడం అక్కడ మేఘన కుటుంబంతో తన అతిశుభ్రతను పాటించలేక ఆనంద్ పడే కష్టాలతో... సినిమా ఆధ్యంతం నవ్వులుపూయిస్తుంది అయితే ఇక్కడ ఎంతో ఘాడంగా ప్రేమించిన మేఘన ఆనంద్ తో పెళ్లి ఎందుకు వద్దనుకుంది? తండ్రి ఒప్పుకున్నా మేఘన మాత్రం ఎందుకు ఒప్పుకోదు? అలాగే మేఘన కోసం ఆమె ఊరెళ్లినా ఆనంద్ కి మేఘన దక్కుతుందా? మేఘన కుటుంబం కి టార్గెట్ అయిన ఆనంద్ అక్కడ నుండి ఎలా బయట పడతాడు? ఇవన్నీ తెలియాలి అంటే... మహానుభావుడు వెండితెర మీద వీక్షించాల్సిందే.
నటీనటులు పాత్ర:
శర్వానంద్... ఆనంద్ పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. హెయిర్ స్టైల్ పరంగా కొంచెం తేడాగా అనిపించినా సినిమా చూసే కొద్ది ఆ ఫీలింగ్ మాయమైపోతుంది. తన కెరీర్ లోనే బెస్ట్ అనకున్న ఒక వైవిధ్యమైన పాత్రలో చాలా బాగా చేసాడు శర్వా. దర్శకుడు పాత్రను డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది. అతి శుభ్రత పాటించే తీరు... శుభ్రత పాటించకపోతే వారిని శర్వానంద్ కోప్పడే తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక కృష్ణగాడి వీరప్రేమగాధ హీరోయిన్ మెహ్రీన్ కౌర్.. ఈ సినిమాలో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. కృష్ణగాడి వీరప్రేమ గదా సినిమా విజయంతో టాలీవుడ్ లో బోణి కొట్టిన మెహ్రీన్ ఈ సినిమాతోనూ హిట్ అందుకుంటుంది. పాటల్లో సారీ లుక్స్ తో... సినిమా మొత్తం మీద ట్రెడిషనల్ లుక్ తో ఆకట్టుకుంది. వెన్నల కిషోర్ కామెడీ కూడా బాగానే ఆకట్టుకుంది. ఇక మెహ్రీన్ తండ్రిగా నాజర్ కి మంచి పాత్ర దక్కింది. ఆ పాత్రలో చాలా చక్కటి నటనతో ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం పనితీరు:
దర్శకుడు మారుతీ మంచి స్టోరీ లైన్ తో సినిమా ని తెరకెక్కించాడు.ముందు నుండి మహానుభావుడు సినిమా మొత్తం కామెడీ కామెడీ అని చెబుతున్నట్టు పెద్దగా అంతే మరీ పొట్టచెక్కలయ్యే కామెడీ లేదు కాని డీసెంట్ గా అతి లేకుండా చిరు మందహాసాలకు మాత్రం లోటు లేకుండా ఎంటర్ టైన్ చేసాడు మారుతీ. మహానుభావుడు ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ స్లో అయిన ఫీలింగ్ కలిగినా ఓవరాల్ నిరాశ కలగకుండా దర్శకుడు సక్సెస్ అయ్యాడు. స్టొరీ వెరైటీ గా అనిపించడం తోనే మహానుభావుడు పెద్ద ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు. కాగా భలే భలే మగాడివోయ్ తరహాలో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికే మారుతీ ప్రిఫరెన్స్ ఇవ్వడం కూడా మరో ప్లస్ పాయింట్. ఓసీడీ పాయింట్‌ను ఎలివేట్ చేయడంతోనే ఫస్టాఫ్ మొత్తం సాగిపోయింది. సినిమాలో ఆసక్తికరమైన ట్విస్ట్ లు ఏమీ లేవు. పైగా ఓసీడీ లక్షణాలను దాటి హీరో కుస్తీ పోటీల్లో ఎలా పాల్గొంటాడన్నది అనే పాయింట్ ని మాత్రం దర్శకుడు మారుతీ సరిగ్గా ప్రెజెంట్ చెయ్యలేకపోయాడు. కథ ఇంకాస్త స్ట్రాంగ్‌గా ఉంటే బావుండేది. మహానుభావుడు సంగీత విషయానికి వస్తే... తమన్ మ్యూజిక్ ఈ సారి మాత్రం మైనస్ కాలేదు. పాటల విషయానికి వస్తే ఎక్కడో విన్నట్టు అనిపించినా... సినిమా చూస్తూ పాటలు వింటే మాత్రం పెద్దగా బోర్ అనిపించవు.ఇక థమన్ ఎప్పటిలాగే... బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చక్కగా ఇచ్చాడు అనే కంటే ఇరక్కొట్టేశాడు అంటే బావుంటుంది. నజర్ షఫీ సినిమాటోగ్రఫీ బావుంది. ప్రతి సన్నివేశాన్ని ఎంతో అందంగా తన కెమరాలో బంధించాడు. పల్లెటూరి వాతావరణాన్ని కూడా సినిమా సూపర్బ్ గా నీట్ గా చూపించాడు.
విశ్లేషణ:
మారుతీ మరోసారి కామెడీతో హిట్ కొట్టేసాడు. సినిమాలో ఓ.. అన్నంత కామెడీ లేకపోయినా ఓకె గా ఉంది. ఇక ఎప్పటిలాగే శర్వానంద్ మంచి ఎనర్జీ ఉన్న పెరఫార్మెన్సు తో చక్కటి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ దసరాకి పెద్ద హీరోల మధ్య నలిగిపోతాడనుకున్న శర్వానంద్ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. అతని దర్యాన్ని ప్రేక్షకులు వమ్ము చెయ్యరు. ఈ దసరా సెలవలకి మంచి కలెక్షన్స్ తో శర్వానంద్ మహానుభావుడు దూసుకుపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పండగ హీరోగా పేరుతెచ్చుకున్న శర్వానంద్ మరోసారి పండగకి విజయం సాధించి సూపర్ అనిపించుకున్నాడు. ఆనంద్ గా శర్వా చేసిన పెరఫార్మెన్సు ఈ సినిమాకి మంచి ప్లస్ అయ్యింది. సినిమాలో కొన్ని విషయాలు ప్రేక్షకుడికి లాజిక్ అనిపించకపోయినా అది పెద్దగా హైలెట్ అవ్వదు. ఓవరాల్ గా తన స్టయిల్ మార్చిన మారుతీ మాత్రం ఈ సినిమాతోమరోమారు విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కృష్ణగాడి వీరప్రేమగాధతో హిట్ అందుకుని క్యూట్ హీరోయిన్ పేరు కొట్టేసిన మెహ్రీన్ కి ఈ సినిమా విజయాన్ని అందించింది. ఓవరాల్ గా దర్శకుడు మారుతీ, హీరో శర్వానంద్, హీరోయిన్ మెహ్రీన్ లకు ఈ విజయ దశమి విజయాన్ని అందించింది. ఇక ప్రేక్షకులు కూడా హాయిగా కాసేపు నవ్వుకోవడానికి... ఈ సినిమా చూసి ఎంజాయ్ చెయ్యడానికి థియేటర్ కి వెళతారు.
ప్లస్ పాయింట్స్: శర్వానంద్, కొన్ని కామెడీ సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం
మైనస్ పాయింట్స్: ట్విస్టులు లేకపోవడం, కథ ముందుగానే తెలిసిపోవడం, పాటలు, సెకండ్ హాఫ్, రొటీన్ క్లైమాక్స్
రేటింగ్: 3 .0 / 5
- Tags
- మహానుభావుడు

