మళ్ళీ అవసరమా?

ఆగష్టు 11 న మూడు సినిమాలు లాంగ్ వీకెండ్ ని క్యాష్ చేసుకుందామని ఎగేసుకుంటూ వచ్చేసి రెండు సినిమాలేమో ఎలాగో పెట్టిన పెట్టుబడి రాబట్టుకున్నాయి. ఇంకో సినిమా మాత్రం సోదిలోకి లేకుండాపోయింది. అందులో ఒక సినిమా 'నేనే రాజు నేనే మంత్రి' కాస్త లాభాలు మూటగట్టుకుంది. ఇంకో సినిమా 'జయ జానకి నాయక' మాత్రం పెట్టిన పెట్టుబడి రాబట్టుకోవడానికి ముక్కుతూ మూలుగుతూనే వుంది. ఇక మరొక మూవీ నితిన్ 'లై' అయితే భారీ డిజాస్టర్ దిశగా పరుగులు పెడుతుంది. మరి పండగ సీజన్ అయితే 10 రోజుల సెలవలు కలిసొచ్చి రెండు కాదు మూడు కాదు నాలుగు సినిమాలైనా బాక్సాఫీసు వద్ద పోటీ పడినా ఒక అందం చందం. కానీ నాలుగు రోజుల సెలవలకి కక్కుర్తి పడి ఇలా పోటీకి దిగితే ఆఖరికి 'లై' సినిమా కంటెంట్ పరంగా బాగున్నప్పటికీ పోటీ తట్టుకోలేక తోక ముడిచింది.
అయితే ఇప్పుడు మరోమారు ఆగస్టు 11 సీన్ రిపీట్ కాబోతుంది. సెప్టెంబర్ 8 న మరో నాలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి. ఇప్పుడు కూడా ఈ సినిమాలేవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కినవి కాదు. భారీ బడ్జెట్ అంటే.... కాస్త ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయి అనుకోవడానికి. ఇవి కూడా మినిమమ్ బడ్జెట్ తో తెరకెక్కినవే కావడం విశేషం. ఇకపోతే సెప్టెంబర్ 8న నాగ చైతన్య హీరోగా శ్రీకాంత్ విలన్ గా తెరకెక్కిన 'యుద్ధం శరణం' తో పోటీకి దిగగా... మంచు మనోజ్ దేశభక్తిని చాటుతూ 'ఒక్కడు మిగిలాడు'తో వచ్చేస్తున్నాడు. ఇక మరో హీరో సచిన్ జోషి హీరోగా వీడెవడుతో ఈ డేట్ కే ఫిక్స్ అయ్యాడు.
ఇక కామెడీ సినిమాలతో ఆకట్టుకునే అల్లరి నరేష్ కూడా సెప్టెంబర్ 8నే తన 'మేడ మీద అబ్బాయి'తో వస్తున్నానంటున్నాడు. మరి ఇలా ఒకేరోజు నాలుగు సినిమాలు తెలిసి తెలిసి పోటీకి దిగడం కరెక్ట్ కాదంటున్నారు. అప్పుడు ఆగష్టు 11 న పోటీ వద్దని వారించినా వారే, ఇప్పుడు కూడా పోటీ వద్దంటున్నారు. అన్ని తెలిసిన ఇలా ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చెయ్యడమే కాకుండా నిర్మాతలు కూడా నష్టపోయే ప్రమాదం ఉన్నట్టు చెబుతున్నారు. మరి ఈ నలుగురిలో ఏ ఇద్దరు కాస్త వెనక్కి తగ్గినా మిగతా రెండు సినిమాలు కాస్త బెటర్ పొజిషన్ కి వచ్చే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. చూద్దాం వచ్చే వారానికి ఎవరైనా ఈ రేస్ నుండి తప్పుకుంటారేమో?

